మాజీ మంత్రి పేర్ని నాని పరోక్షంగా జగన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్ పై మండిపడ్డారు. తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు.. సీఎం ఇంటి ముందు ముందు ధర్నా చేస్తానన్నారు. అప్పట్లో ఇద్దర్నీ పిలిపించి ఏదో విధంగా సర్దుబాటు చేశారు. కానీ ఆ అసంతృప్తి అంతే ఉంది. తాజాగా పేర్ని నాని జెడ్పీ సమావేశానికి గైర్హాజరు అవడంపై మరోసారి మండిపడ్డారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. కృష్ణా జిల్లా జడ్పీ సమావేసానికి రాకపోవడంతో కలెక్టర్ టార్గెట్ గా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.
సర్వ సభ్య సమావేశం కన్నా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎక్కువయ్యిందా ? అంటూ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్పై మండిపడ్డారు పేర్నినాని.. ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండలేని అధికారులు ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయ సలహా మండలి సమావేశం కంటే ముందే సర్వ సభ్య సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.. కానీ, జడ్పీ సమావేశానికి రాకూడదు అనే ఈ సమావేశం కలెక్టర్ ఏర్పాటు చేశారని విమర్శించారు. నిజానికి జడ్పీ సమావేశానికి వెళ్లనవసరం లేదని.. వ్యవసాయ సలహా మండలి సమావేశం పెట్టుకోవాలని ఏలూరు కలెక్టర్ కు.. సీఎంవోనే సూచించింది. ఈ విషయం కూడా పేర్ని నానికి తెలుసు. అందుకే తన విమర్శల్లో సీఎంవో ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. సర్వ సభ్య సమావేశానికి వెళ్లొద్దని సీఎంవో చెప్పిందా అని మండిపడ్డారు. జిల్లాలో తనపై కుట్ర జరుగుతోందని పేర్ని నాని గట్టిగా నమ్ముతున్నారు.
తనను మంత్రి పదవి నుంచి తప్పించడమే కాకుండా ప్రతిపక్ష నేతల్ని ఘోరంగా తిట్టడానికి మాత్రమే తనను వినియోగించుకుంటున్నారని ఇతర విషయాల్లో పక్కన పెట్టారని పేర్ని నానికి కూడా అర్థమైంది. అందుకే.. ఆయన సందర్భం వచ్చినప్పడుల్లా.. సీఎంవోను టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.