సీఎం జగన్ కు యాభై ఏళ్లు.. పేర్ని నానికి యాభై ఆరేళ్లు.. కానీ పేర్ని నాని ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అదీ కూడా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే. అది రాజకీయ సభ కాకపోయినా ఆయన బలవంతంగా ప్రకటన చేసినట్లుగా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆయన బందరు పోర్టు పనులపై మాట్లాడుతున్నప్పుడు.. ఇక ప్రసంగాన్ని ఆపేయాలని స్టేజ్ పై ఉన్న ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన నువ్వు ఎంత గిల్లినా నేను తగ్గబోనని… మాట్లాడి తీరుతానని అన్నారు. రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించేశారు. దీంతో పేర్ని నానితో బలవంతపు రిటైర్మెంట్ ప్రకటింప చేశారన్న అభిప్రాయం వైసీపీలో ఎక్కువగా వినిపిస్తోంది.
పేర్ని నాని కొంత కాలంగా తాను పోటీ చేయబోనని చెబుతున్నారు కానీ రిటైర్మెంట్ గురించి చెప్పడం లేదు. తన కుమారుడికి చాన్సివ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే జగన్ అందుకు సిద్ధంగా లేరని. పేర్ని నాని పోటీ చేయకపోతే వేరే నేతకు టిక్కెట్ ఇస్తారు కానీ పేర్ని నాని కొడుక్కి మాత్రం ఇవ్వబోరన్న ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడికే టిక్కెట్ కావాలంటున్న పేర్ని నాని జగన్ పై ఒత్తిడి తేవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కొంత మంది అంటున్నారు.
కారణం ఏదైనా ఇలా జగన్ పాల్గొన్న సమావేశంలోనే.. వైసీపీ తెగ గెలిచేస్తుందని ప్రకటించుకుంటున్న సమయంలోనే ఇలా..నేతలు తాను పోటీ చేయబోనని ప్రకటించడం.. ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. చాలా మంది సీనియర్ నేతలు పోటీకి సిద్దపడటం లేదు. తమ వారసులకు చాన్సివ్వాలంటున్నారు. గెలుపుపై నమ్మకాలు లేకపోవడం.. వైసీపీ ఓడిపోతే వేధింపులు తీవ్ర స్థాయిలో ఉంటాయన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వెనుకడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. మచిలీపట్నంలో సౌమ్యుడిగా పేరున్న కొల్లు రవీంద్రను కూడా తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేశారని కొంత మంది గుర్తు చేస్తున్నారు.