జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పేర్ని నాని. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది బీజేపీ ఆశని.. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలని ఆరోపించారు. చంద్రబాబు గతంలో మోడీని తిట్టి ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారని విమర్శించారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీపై ఢిల్లీలో కావాల్సినంత స్నేహం మెయిన్ టెయిన్ చేస్తూ.. రాజకీయంగా లబ్ది పొందుతున్న వైసీపీ రాష్ట్రంలో మాత్రం అనేక రకాలుగా ఆ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో ఏపీ సర్కార్కు సహకరించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఏం చేసినా.. అంగీకరించడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఉక్కపోత తప్పడం లేదు. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేసినా కొత్త అప్పులకు అనుమతులు రాకపోగా.. పాత అప్పుల లెక్కలు అడుగుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది. ఈ క్రమంలో బీజేపీ పై ఒత్తిడి పెంచడానికి కొత్తగా ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచనలు చేస్తున్నారన్న ఆరోపణలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
పేర్ని నాని ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న మాటలు యథాలాపంగా అన్నారా లేక వైసీపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను గురించి అన్నారా అన్నది స్పష్టత లేదు. కానీ బొత్స సహా పలువురు నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు వైసీపీని కానీ.. ప్రభుత్వాన్ని కానీ దారుణంగా విమర్శించిన ఘటనలు పెద్దగా లేవు. ప్రస్తుత ఏపీ బీజేపీ నాయకత్వం మొత్తం .. వైసీపీకి అనుకూలంగానే ఉంది. అయినా.. ఎప్పటికప్పుడు టీడీపీకి బీజేపీకి లింక్ పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది.