పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని .. పెద్ద నోరేసుకుని మాట్లాడటం .. జగన్ రెడ్డికి పెద్ద పాలేరునని ప్రకటించుకోవడం ఆయన స్టైల్. ఇప్పుడు ఆయన కూడా అడ్డంగా దొరికిపోయారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో ఆయనే తప్పు ఒప్పుకున్నట్లుగా లెటర్ కూడా రాశారు. ఈ వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేర్ని నానికి గోడౌన్లు ఉన్నాయి. వాటిని పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. కానీ సరుకు పెట్టుకోవడానికే. నిర్వహణ అంతా వారిదే. అలా పౌరసరఫరాల శాఖ ఆయన గోడౌన్లలో బియ్యం దాచి పెట్టింది. అలా దాచి పెట్టిన బియ్యంలో 250 టన్నులు కనిపించకుండా పోయాయి. అంటే రెండున్నర లక్షల కిలోలు. ప్రభుత్వం మనదే కదా.. కనిపించకుండా పోయాయని ఓ లేఖ రాసి.. ఎంత అవుతుందో చెబితే డబ్బులిస్తామని ఆఫర్ చేశారు. అసలు బియ్యాన్ని మాయం చేయడం ఏమిటి..డబ్బులిస్తామని ఆఫర్ చేయడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ విషయం వెలుగులోకి వచ్చింది.
బియ్యం అక్రమాలపై సిట్ వేయడంతో..ఇప్పుడు మొత్తం వెలుగులోకి వస్తున్నాయి. ఆ సిట్ కేసులు పెట్టి అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోనుంది. ఇప్పుడు పేర్ని నాని కూడా ఇందులో ఇరుక్కున్నారు. ఆయన గోడౌన్ల కేంద్రంగా చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి తెస్తే… ఎంత లోతుకు కూరుకుపోతారో చూడాల్సి ఉంది.