జగన్ అసెంబ్లీకి హాజరు అవుతారని ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన తొందరపాటు నిర్ణయంగా వైసీపీ భావిస్తోందా? ఇదే సభలో వైసీపీని ఇరుకున పెట్టేందుకు మరింత దోహదం చేస్తుందని అంచనాకు వచ్చారా ? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
జగన్ అసెంబ్లీకి హాజరు అవుతారనే ప్రకటన గోప్యంగా ఉంచాల్సిందని ఆ పార్టీ భావిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ అసెంబ్లీకి వస్తున్నారని పేర్ని నాని ముందే చెప్పడం వలన కూటమి సర్కార్ కు బిగ్ అడ్వాంటేజ్ అని వైసీపీ ఇప్పడు ఆందోళన చెందుతోంది. జగన్ కు ఉచ్చు బిగించేలా అధికార పక్షం అస్త్రశస్త్రాలను రూపొందించి ..సభలో జగన్ ను డిఫెన్స్ లో పడేసేలా చేస్తుంది అన్నది ఆ పార్టీ నేతల భయంగా తెలుస్తోంది.
గురువారం సాయంత్రం శాంతి భద్రతలపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నారు చంద్రబాబు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారనే ప్రకటనతో వైసీపీ హయాంలో శాంతి భద్రతల వైఫల్యాన్ని ఆయనకే త్రీడీలో చూపించాలని..శ్వేతపత్రం వేదికను అసెంబ్లీకి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కూటమి హయాంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని జగన్ చేస్తోన్న ఆరోపణలకు అసెంబ్లీలోనే గట్టి కౌంటర్ ఇచ్చి జగన్ నోరు మూయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది.
ఇవన్నీ జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేవే. పోనీ, వీటన్నింటిని దులిపేసుకొని అసెంబ్లీ నుంచి తుర్రుమంటే పారిపోయారని విమర్శలు వస్తాయి. జగన్ ను కూటమి ఎదురుదాడి నుంచి కాపాడేందుకు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కూడా లేరు. వారంతా ఓటమి పాలయ్యారు. అందుకే జగన్ అసెంబ్లీకి హాజరుపై వ్యూహాత్మకంగా వ్యవహరించి చివర్లో ఈ విషయాన్ని రివీల్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు.