అందరూ టిక్కెట్ ధరల అంశంపై అమరావతి వెళ్లి పేర్ని నానితో సమావేశం అయితే.. పేర్ని నానినే తమ దగ్గరకు వచ్చి మాట్లాడారంటూ మోహన్ బాబు, మంచు విష్ణు చేసిన ప్రచారానికి పేర్ని నాని మైండ్ బ్లాంక్ అయ్యే రిప్లయ్ ఇచ్చారు. దీంతో మంచు విష్ణు వెంటనే తన ట్వీట్‌ను అప్ డేట్ చేసుకోవాల్సి వచ్చింది. శుక్రవారం పేర్ని నాని మోహన్ బాబు ఇంటికెళ్లారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన మంచు విష్ణు టాలీవుడ్ సమస్యలపై తమతో చర్చించారని ట్వీట్ చేశారు. ఆయన తన పీఆర్వో టీంతో అంతకు మించి చర్చలు జరిగాయని మీడియాకు లీక్ ఇచ్చారు. దాంతో పేర్ని నాని చిరంజీవి బృందంతో జరిగిన చర్చల వివరాలను మోహన్ బాబుకు చెప్పామన్నట్లుగా.. వివరణ ఇచ్చామన్నట్లుగా ప్రచారం జరిగిపోయింది.
ఇది చిరంజీవి బృందాన్ని అవమానించినట్లుగా ఉండటమే కాదు ప్రభుత్వాన్నే మోహన్ బాబు తన ఇంటికి రప్పించుకున్నట్లుగా ఉండటంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో రాత్రికి పేర్ని నాని స్పందించారు. జరుగుతున్న ప్రచారం మొత్తం ఉత్త ట్రాష్ అని తేల్చేశారు. పార్టీ ఆఫీసులో మీడియాను పిలిచి మరీ అసలు తాను హైదరాబాద్‌లో జరిగిన మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరయ్యానని ఆ సమయంలో రమ్మని పిలిస్తే తాను తాను మోహన్ బాబు ఇంటికెళ్లానన్నారు. మోహన్ బాబుతో తనకు ఎప్పటి నుండో పరిచయం ఉందన్నారు. మాట్లాడి వెళ్లే సమయంలో విష్ణు శాలువా కప్పారని అంతకు మించి ఏమీ లేదన్నారు.
తనకు శాలువా కప్పిన ఫోటోను పెట్టి మంచు విష్ణు చేసిన ట్వీట్ విషయంలో ఆయననే ఫోన్ చేసి అడిగానని స్పష్టం చేశారు. నిలదీయడంతో ఆ తన ట్వీట్‌ను అప్ డేట్ చేశారని వివరించారు. ప్రభుత్వం తరపున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. అలాగే తమ సమావేశంలో టాలీవుడ్ సమస్యలపై మాట్లాడేందుకు తాను కూడా వద్దామనకున్నానని కానీ చిరంజీవి పిలువలేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాలని అన్నారని చెప్పుకొచ్చారు.
అసలు సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి సంజాయిషీ కానీ.. విరవణ కానీ తాము మోహన్ బాబుకు ఇవ్వలేదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ తప్పని తేల్చేశారు. దీంతో మోహన్ బాబు ఫ్యామిలీ చేసుకున్న ప్రచారం రివర్స్ అయింది.