మంత్రి హోదాలో ఉన్న వారు ఏమి చెబుతారు సహజంగా..! తమ పదవి.. బాధ్యతలు అయినా గుర్తు చేసుకుని.. అందరూ నీతి నిజాయితీగా పని చేసేలా చూస్తామని చెబుతారు. అంతే కానీ అందరికీ లంచాలివ్వాల్సిందే.. తప్పదు..అందుకే పనులు చేయకండి అని ఎవరైనా చెబుతారా…? ఎవరో నూటికో కోటికో ఒకరు చెబుతారు.. అలాంటి వారే.. ఏపీ మంత్రి పేర్ని నాని. ఆయన ప.గో జిల్లా భీమవంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల శిక్షణా శిబిరానికి వెళ్లాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాల్సిందే అనుకున్నారేమో కానీ.. హితబోధ చేసేశారు.
సొంత పంచాయతీలో పనులను మీరు సర్పచ్గా ఉండి చేయవద్దు. మీరు గబ్బుపట్టి పోవడానికి ప్రధాన కారణం పనులు చేయడమేనని నేరుగా సలహా ఇచ్చారు. ఎదురుగా ఉన్న సర్పంచ్‌లో ఆశ్చర్యపోయారని తెలుసుకున్నారేమో కానీ.. వెంటనే తన మాటలకు గల కారణాలు చెప్పారు. ఎందుకంటే… అవినీతి. సర్పంచ్ పనులు చేస్తే… చేసిన పనులలో పర్సంటేజ్ కోసం ఏఈ వదలడట… సీఎంఎఫ్ఎస్ పర్సంటేజ్ ఇవ్వకుండా బిల్లు చేయడట.. ఆయనకు చెల్లించుకుని బిల్లు వచ్చాక పంచాయతీ సెక్రటరీ, ఎండీఓ చెక్కు రాయడట. ఎందుకంటే.. ఆయనకూ పర్సంటేజీ చెల్లించాలట. అన్నీ పోగా మీకు మిగిలేదీ, చచ్చేదీ ఏమీ ఉండదని పేర్ని నాని సర్పంచ్‌లకు జ్ఞానబోధ చేశారు. అంతిమంగా ఆయన చెప్పేదేమిటంటే.. సొంత పంచాయతీలో సర్పంచ్‌లు పనలు చేయవద్దు.. కావాలంటే పక్క పంచాయతీలో చేసుకోమని. మరి అక్కడ మాత్రం పర్సంటేజీల గోల ఉండదా అంటే.. స్వయంగా మంత్రి హోదాలో ఉండి కూడా పర్సంటేజీలు తప్పవని ఢంకా బజాయించి చెబుతున్న పేర్ని నాని.. ఆ గ్యారంటీ ఎలా ఇస్తారు. అక్కడ కూడా పర్సంటేజీలు చెల్లిస్తేనే బిల్లులొస్తాయి. మరి అలాంటి దానికి సొంత పంచాయతీ అయితేనేం..పక్క పంచాయతీ అయితేనేం అన్నదానిపై మాత్రం పేర్ని నాని క్లారిటీ ఇవ్వలేదు.
ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపేర్ని నాని… నిజంగా అలాంటి పర్సంటేజీలు అన్ని చోట్లా ఆనవాయితీగా వస్తున్నాయని తెలిస్తే… వాటిని అరికట్టడానికి చేయాల్సినంత ప్రయత్నం చేయాలి. కానీ మంత్రిగా ఉండి.. లంచాలు తీసుకునేవారిని ఏమీ చేయలేమని.. వారికి పర్సంటేజీ ఇవ్వడం కన్నా పనులు చేయడం మానేయమని సలహా ఇవ్వడం … అందర్నీ ఆశ్చర్య పరిచింది. పర్సంటేజీలు ఏ స్థాయిలో అయినా తప్పవని ఆయన ఎలా అనుకుంటున్నారో కానీ..ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెలిస్తే.. ఈ పర్సంటేజీలన్నీ పోను ఎంతో కొంత వెనుకేసుకుంటామని ఆ శిక్,ణకు వచ్చిన సర్పంచ్‌లు గుసగుసలాడుకున్నారు. అంత ఖర్చు పెట్టుకుని సర్పంచ్‌గా ఎన్నికైంది ఎందుకనేది వారి ప్రధాన సందేహం. అంతేగా మరి యథారాజా.. తథా ప్రజ అనే సామెత ఊరకనే పుట్టలేదు గా..!