చిరంజీవికి ఫోన్ చేసి మరీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఖరారు చేశారని.. టాలీవుడ్ బృందంతో చర్చలకు రావాలని స్వయంగా పేర్ని నాని పిలిచారు. ఇది ఆగస్టు రెండో వారంలో జరిగింది. చిరంజీవిని ప్రత్యేకంగా సీఎం జగన్ ఆహ్వానించారని… అపాయింట్మెంట్ ఖరారు చేశారని చెప్పారు. ఆ తర్వాత ఓ సారి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి చిరంజీవితో భేటీ అయ్యారు కూడా . ఏం జరిగిందో కానీ ఆ తర్వాత చిరంజీవికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పేర్ని నానినే కొంత మంది సినిమా పెద్దలతో భేటీ అయ్యారు.
కానీ ఇప్పుడు అదే పేర్ని నాని భిన్నంగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ను చిరంజీవి అపాయింట్మెంట్ అడిగారో లేదో తనకు తెలియదని చెప్పుకొచ్చారు . డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడి… హైకోర్టు సూచన మేరకు ఏర్పాటు చేసిన కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించి టిక్కెట్ ధరలను ఖరారు చేస్తామన్న ఆయన సహజ శైలిలోసినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించారు. చిరంజీవి అపాయింట్మెంట్ గురించి తేలికగా మాట్లాడారు.
నాని ఏ ఊరు లో ఉన్నారో..ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదని సెటైర్ వేశారు. సిద్దార్థ్ ఎక్కడుంటారు.. ఏమైనా ఇక్కడ టాక్స్ లు కట్టాడా…మా ఇళ్ళకి వచ్చి చూశాడా..మేము ఎంత విలాసంగా ఉంటున్నామో అని పేర్ని నాని మండిపడ్డారు. పేర్ని నాని తీరు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీని అవమానించేదిలా ఉంది కానీ… ఓ ఇండస్ట్రీగా గౌరవం ఇద్దామనే ఆలోచన ఏ కోశానా లేదన్న అభిప్రాయం టాలీవుడ్లో వినిపిస్తోంది. పర్మిషన్లు లేకే ధియేటర్లు మూసేస్తున్నారని.. అలాగే అవి లేకే సీజ్ చేస్తున్నామని కక్ష సాధింపు కాదని పేర్ని నాని చెప్పుకొచ్చారు.