ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బకొట్టాలనుకోవడం లేదు. తమకు అండగా ఉన్న వారికి అండగా నిలిచేందుకు అధికార దుర్వినియోగం చేయడానికి సిద్ధమని సంకేతాలు పంపుతోంది. టిక్కెట్ రేట్లు పెంచాలన్న చిరంజీవి ట్వీట్ పై స్పందించిన పేర్ని నాని.. టిక్కెట్ రేట్ల పెంపు జీవోలో మార్పులు చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఏపీలో జరిగిన పరిణామాలు.. తీసుకున్న నిర్ణయాలు చూస్తే సెలక్టివ్‌గా కొన్ని సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం ఖాయంగా భావించవచ్చు.
ఏపీలో ప్రభుత్వం రాగానే అన్ని కాలేజీల ఫీజుల్ని రెగ్యూలేట్ చేస్తూ ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అతి తక్కువ ఫీజులు సిఫారసు చేసింది. అ ఫీజులు గిట్టుబాటు కావనుకుంటే తమకు ధరఖాస్తు చేసుకోవాలని సదరు కమిషన్.. కమిటీ ఆదేశించింది. దరఖాస్తు చేసుకుంటే.. తమ.. మన అనుకునేవారికి ఫీజుల పెంపుకు చాన్సిస్తారు. మనోడు కాదనుకున్నవారికి అతి తక్కువ ఫీజులకే నడుపుకోవాలి. ఒక్క విద్యా సంస్థల విషయంలోనే కాకుండా ఆస్పత్రులు సహా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. మనోడు అనేవాడు వ్యాపారం చేసుకోవాలి… ఇతరులు చేసుకోకూడదన్నట్లుగా ప్రభుత్వ విధానాలున్నాయి.
ఇదే తరహాలో ఇప్పుడు తమది భారీ బడ్జెట్ సినిమా అని టిక్కెట్ రేట్లు పెంచుకుంటామని ఎవరైనా ధరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అంటే.. సెలక్టివ్‌గా తమకు దగ్గర అనుకున్న వాళ్లో.. లేకపోతే… దగ్గరగా ఫీలయ్యేలా చేసేవాళ్లకు మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. లేకపోతే..తక్కువగానే ఉంటాయి. ప్రభుత్వం అన్ని సినిమాలకు ఒకలాగ కాకుండా కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడం లాంటివి చేస్తే ఖచ్చితంగా దురుద్దేశం ఉన్నట్లేనని ప్రజలు అనుమానిస్తారు. ఇండస్ట్రీ కూడా చీలిపోతుంది. ఏం జరుగుతుందో వేచిచూడాలి !