ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా కల్పించడానికి కారణం అవుతున్నాయి. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్‌ను సతీసమేతంగా కలిశారు. గవర్నర్ రెండేళ్లు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కలవలేదు.. ఆయన పుట్టినరోజు నాడు కలవలేదు…కానీ తర్వాతి రోజు మాత్రం సతీసమేతంగా వెళ్లి కలిశారు. దీంతో అప్పుడే రాజకీయవర్గాల్లో ఊహాగానాల్లో ప్రారంభమయ్యాయి.
నాడు రిపబ్లిక్ టీవీ చెప్పిన “వైసీపీలో చిలిక” కథనం నిజమవుతోందా..?
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉక్కపోత సీజన్ నడుస్తోంది. ఓ వైపు ఆర్థిక సమస్యలు.. మరో వైపు అప్పులపై కేంద్ర ప్రభుత్వం విచారణ.. మరో వైపు సీనియర్ల అసంతృప్తి ఇలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి కలిసి వస్తున్నాయి. వైసీపీలో నేతల అసంతృప్తిపై జాతీయ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఓ సారి బీజేపీ మౌత్ పీస్ లాంటి రిపబ్లిక్ టీవీనే చీలిక రాబోతోందని ప్రకటించింది. దీనిపై సజ్జల అప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి… అలాంటిదేమీ లేదన్నారు. కానీ బొత్స సత్యనారాయణ… అదే పనిగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని.. బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్నారన్న ప్రచారం మాత్రం ఉద్ధృతంగా సాగుతోంది. వైసీపీ నేతలు ఎక్కుగా ఈ విషయాలను లీక్ చేస్తున్నారు.
ఇద్దరు సీనియర్ మంత్రుల అసంతృప్తి ఎక్కడ వరకూ వచ్చింది..?
ఇక చిత్తూరు జిల్లా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని సైతం జగన్ దూరం పెడుతున్నారు. ఈ విషయంలోనూ ఆయన అసంతృప్తిగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి అమరరాజా ఫ్యాక్టరీ విషయంలో ఆయన ప్రభుత్వం నిర్ణయాన్ని గట్టిగా సమర్థించలేదు.. అదే సమయమంలో వ్యతిరేకించలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి లాక్కున్న వారున్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టడం మాత్రం సాధ్యం కాదని ఎవరైనా అంచనా వేస్తారు.
వైసీపీనే వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించిందా..?
అయితే ఇక్కడ రెండు అంశాలను ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకటి సీఎం జగన్ బెయిల్ రద్దయి మళ్లీ జైలుకెళ్లడం. అలా జరిగితే ఖచ్చితంగా సీఎం మార్పు చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల్లో చీలిక వచ్చి బీజేపీ తన ప్లాన్ ను అమలు చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. రెండోది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి ఉంది. అందుకే వైసీపీనే వ్యూహాత్మకంగా… భారం దించేసుకుని రాజీనామా చేసేసి.. బీజేపీ మీద తోసేసి. ప్రజల వద్దకు సానుబూతి కోసం వెళ్లడం ఆ వ్యూహం. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందన్న ఉద్దేశంతోనే పేర్ని నానితో వ్యూహాత్మక రాజకీయం ప్రారంభించారన్న అభిప్రాయం ఏపీ రాజకీయవర్గాల్లో బలంగా ఏర్పడుతోంది.