ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తాననే ధైర్యం విపక్ష నేతలకే ఉండదు. ఎందుకంటే ఆయన ఇంటికి మూడు, నాలుగు కిలోమీటర్ల ముందే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. కానీ మాజీ మంత్రి.. వైసీపీ నేత మాత్రం తమ నేతల్ని తీసుకెళ్లి మరీ జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్నారు. వేరే పార్టీ అధికారంలో ఉందేమో అని ఆ క్షణంలో అనుకున్నారేమో అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలోనే ఆయన మంత్రిగా చేశారు. ఆయనేవరో కాదు పేర్ని నాని. కలెక్టర్ ఓ సమావేశానికి రాలేదని.. తాను సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా, జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఇతరులు హాజరు అయ్యారు. గతంలో క్రిష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ్టి సమావేశానికి కూడా రాకపోవడంతో ఎమ్మెల్యే పేర్ని నాని అగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు కలెక్టర్ ప్రసన్నం వెంకటేష్ మరోసారి జెడ్పీ సమావేశానికి రాకపోతే కనుక జిల్లాకు చెందిన జెడ్పీటీసీ మెంబర్లందరితో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తామంటూ పేర్ని నాని అందరి ముందే వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సమావేశంలో తీర్మానం కూడా చేయాలని పేర్నినాని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉన్న వైసీపీ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అసలు జగన్ కు ఏం సంబంధం అని.. ఈ విషయంలో జగన్ ప్రస్తావన ఎందుకు తెచ్చారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తాను వచ్చే ఎన్నిక్లలో పోటీ చేయబోనని చెబుతున్న పేర్ని నాని వ్యవహారశైలి ఇటీవలి కాలంలో కాస్త భిన్నంగానే ఉంది.