మంత్రి పదవి పోవడం ఖాయమని తేలిపోయిన తర్వాత కూడా పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుని జగన్‌ను మెప్పించి ఎలాగోలా మంత్రి పదవిని నిలబెట్టుకుందామనే తాపత్రయం పేర్ని నానిలో ఎక్కువగానే కనిపించింది.కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలంటూ మంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆయన రాజకీయాలపైనా మాట్లాడారు . ఆయన రాజకీయం అంటే పవన్ కల్యాణ్‌ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం.ఈ సారి కూడా అదే ఫాలో అయ్యారు. పవన్ కల్యాణ్ ప్రతీ ఎన్నికలకు ముందు మాట మారుస్తున్నారని.. ఆయనలా మాట మార్చే వారిని ప్రజలు చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ హాబీ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఆయన ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు కాదన్నారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బీజేపీని తిట్టారని ఇప్పుడు బీజేపీ సంకలో ఉండి చంద్రబాబుకు కన్ను కొడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా పాచిపోయిన లడ్డూ అని పవన్ అన్నారన్నారు.. ప్రతి ఎన్నికకకు ఒక పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందని విమర్శించారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. గువేరా, పూలే అందరూ అయిపోయారని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ఫొటో పెట్టుకున్నారని పేర్ని నాని అన్నారు. ఆయన వల్ల ఎవరికీ రాజకీయ ప్రయోజనం, నష్టం ఉండదని పేర్ని నాని విశ్లేషించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పేర్ని నాని తప్పు పట్టారు. గత ఎన్నికల్లో జగన్ సీఎం కాడు అని ప్రచారం చేశారని ఇప్పుడు అయ్యారని గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలకు క్రెడిబులిటీ లేదని స్పష్టం చేశారు. తాను ఎవరి పల్లకీని మోయడానికి రాలేదని ప్రజల్ని పల్లకీ ఎక్కించడానికి వచ్చానని పవన్ అన్న వ్యాఖ్యలపైనా పేర్ని నాని స్పందించారు. 2014 ఎన్నికల్లో ఎవరి ప్లలకీ మోశారని ప్రశ్నించారు. మంత్రిపదవిలో ఉన్నారు కాబట్టి.. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే మీడియా హైలెట్ చేసింది. మరి తర్వాత పట్టించుకుంటుందో లేదో పేర్ని నానికే తెలియాలి.