తాను సీఎం జగన్ కుటుంబానికి పెద్ద పాలేరునని ప్రకటించుకున్నారు. సొంత సామాజికవర్గాన్ని చులకనగా మాట్లాడారు. అయితే పేర్ని నానికి పదవి నిలబడలేదు. ఎందుకు ఇలా చేశారో ఎవరికీ అర్థం కాలేదు. అసలు విషయం ఏమిటంటే… సీఎం జగన్ వ్యాపార భాగస్వామిగా అందరూ భావిస్తున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో ఆయనకు సరిపడకపోవడమేనని చెబుతున్నారు. ఇంత కాలం ఉప్పు.. నిప్పులా ఉన్న వారి సంబంధాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. పేర్ని నానిపై తన కోపాన్ని మరోసారి బాలశౌరి బహిరంగంగానే వెల్లడించారు.
మచిలీపట్నంలో పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని.. ఎంపీ అయిన తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల పేర్ని నాని వర్గీయులు ఎంపీని అడ్డుకుంటున్నారు. శుక్రవారం కూడా ఇలాగే అడ్డుకోవడంతో ఆయన బహిరంగంగా విమర్శలు చేశారు. పేర్ని నాని టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని సీఎంను, పార్టీని, ప్రభుత్వాన్ని సుజనా తిడితే స్పందించరని.. కొనకళ్లతో వారానికోసారైనా మాట్లాడకపోతే నిద్రపట్టదని ఆరోపించారు. ఇకపై బందర్లోనే ఉంటా.. కార్యక్రమాల్లో పాల్గొంటాను.. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తానని సవాల్ చేశారు.
నిజానికి బాలశౌరి గుంటూరుకు చెందిన వ్యక్తి. తనది మచిలీపట్నం కాదు. అయినా సరే మచిలీపట్నం వెళ్లి అక్కడి వైసీపీ నేతలనే సవాల్ చేసే పరిస్థితి వచ్చింది. దీనిపై పేర్ని నాని ఎలా స్పందిస్తారో ఇంకా స్పష్టత లేదు. కానీ.. హైకమాండ్ వద్ద తన కన్నా బాలశౌరీకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్తో ఆయనకు ఉన్న ఆర్థిక సంబంధాలపై వైసీపీలో అందరికీ క్లారిటీ ఉంది. తన ఊరికి ఎక్కడి నుంచో వచ్చి తనను సవాల్ చేస్తున్న బౌలశౌరికి పేర్ని నాని ఎలాంటి కౌంటర్ ఇస్తారోనని వైసీపీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి.