మాజీ మంత్రి పేర్ని నాని అతి పెద్ద సమస్య నుంచి గట్టెక్కారు. తన భార్య అరెస్టు కాకుండా .. ఆమెను ఆజ్ఞాతంలో ఉంచి న్యాయపోరాటం చేసి ముందస్తు బెయిల్ పొందారు. మచిలీపట్నం కోర్టు సోమవారం పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. భార్యను ఎక్కడ జైలుకు పంపుతారో అని పేర్ని నాని మానసికంగా నలిగిపోతున్నారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఆజ్ఞాతంలోకి పోయానని అంటున్నారు… భార్యను అరెస్టు నుంచి కాపాడుకోవాలంటే మీరు వెళ్లరా అని తనపై విమర్శలు చేస్తున్న వారిని ఎదురు ప్రశ్నించారు.
తన భార్యను అరెస్టు చేయించాలని ప్రయత్నించారని కానీ చంద్రబాబు ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. కారణం ఏదైనా తన భార్యకు రాసిచ్చిన గోడౌన్ల కారణంగా ఆమె జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే ఆయన తట్టుకోలేరని తేలిపోయింది. ఎలాగోలా ఈ గండం నుంచి ఆయన బయటపడ్డారు. ఆ గోడౌన్లు భార్య పేరు మీద పెట్టినప్పటికీ అందులో ఉన్న బియ్యాన్ని మాత్రం మాయం చేయడానికి చాలా పెద్ద స్కెచ్ వేశారని పోలీసులు అంటున్నారు. బియ్యం మాయం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా ఈ స్కాంలో పాత్రధారి. తాను ఎక్కడ బయటపడతానో అని తానే ఫిర్యాదు చేశారు.
కొల్లు రవీంద్ర పేర్నినానికి ఇక నిద్రలేని రాత్రులేనని హెచ్చరించారు. 2014-19 మధ్య ఐదేళ్లు కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నారు. మచిలీపట్నంలో రాజకీయ అరెస్టులే జరగలేదు. కానీ పేర్ని నాని మంత్రి అవగానే.. కొల్లు రవీంద్రపై ఓ మర్డర్ కేసులో నిందితునిగా చేర్పించి అరెస్టు చేయించేశారు. ఇలా చేయడంతో పేర్ని నానిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మంచి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టారని అనుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయన.. ఆయన భార్యను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినా కనీసం సానుభూతి కూడా ప్రజల నుంచి లభించలేదు.