అనుమానం పెనుభూతం. అది మనసులో పడితే విచక్షణ కోల్పోతారు. అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ భర్త వ్యవహారం ఇప్పుడు మరోసారి అలాంటి మానసిక విపరీత ప్రవర్తనతో హైలెట్ అవుతోంది. తన భార్య వేరే మగవాళ్లతో మాట్లాడుతోందని… కొట్టి పుట్టింటికి పంపేశాడు. మళ్లీ తన వద్దకు రావాలంటే ఖచ్చితంగా వేరే మగవాళ్లతో మాట్లాడనని రాసివ్వాలని షరతు పెట్టాడు. అయితే మగవాళ్లతో మాట్లాడనని రాసివ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించే సరికి..భర్తకు కోపం వచ్చింది.వెంటనే కత్తి తీసుకుని భార్యను పొడిచేశాడు.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రజాక్, షర్మిల ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూంటారు. వ్యాపారంలో భాగంగానో.. మరో కారణంగానో… షర్మిల ఇతరులతో మాట్లాడుతూంటారు. అయితే ఇలా మాట్లాడటం రజాక్‌కు నచ్చలేదు. మగవాళ్లతో అనవసరంగా మాట్లాడుతున్నదని అనుమానం పెంచుకుని హింసించడం ప్రారంభించాడు. చివరికి విసుగుపుట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగు నెలల తర్వాత పెద్ద మనుషుల్ని తీసుకుని తిరిగి వచ్చిన ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. మగవాళ్లతో మాట్లాడనని అగ్రిమెంట్ రాసివ్వాలని పట్టుబట్టారు.
ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటామని అసలు అలా రాసివ్వమని అడగడం ఏమిటని .. భార్యతో పాటు పెద్దలు చెప్పినా పట్టించుకోలేదు. గొడవపడ్డాడు. ఆ గొడవలోనే భార్యపై కత్తితో దాడి చేశాడు. భార్య పరిస్థితి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లలతో జీవితం సాఫీగా గడపడానికి.. ఆమె కూరగాయల వ్యాపారంలో సాయం చేయడమే ఆమె తప్పయిపోయింది. చివరికి అనుమానించి… చంపినంత పని చేశాడు. అనుమాన భూతం పట్టుకుంటే వదలదని రజాక్ మరోసారి నిరూపించాడు.