రాజధాని అమరావతిలో రూ. 30వేల కోట్ల దుబారా జరిగిందని… జగన్మోహన రెడ్డి సర్కార్ నియమించిన పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాజధాని ,ప్రాజెక్టులు, నిర్మాణాలు ,అవకతవకలపై పీటర్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ రాజధానిలోని ప్రతి ప్రాజెక్టు ,నిర్మాణాలను పున సమీక్షించాలని నివేదిక లో పేర్కొంది, రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు కమిటీ తేల్చింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని… నివేదికలో కమిటీ తెలిపింది. సుమారుగా రూ.30 వేల కోట్ల మేర దుబారా జరిగినట్లు పీటర్ కమిటీ సభ్యులు అంచనా వేశారు. 75 శాతం పైగా పూర్తి అయిన టవర్లు, భవనాల విషయం ఏం చేయాలన్న విషయాన్ని ప్రభుత్వ నిర్ణయానికి కమిటీ వదిలేసింది.
మిగిలిన అన్నింటినీ సమీక్షించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే… అన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులను నిలిపివేసిన ప్రభుత్వం వాటిపై నిపుణుల కమిటీని నియమించింది. మొదటగా ఈ పీటర్ నేతృత్వంలో ఓ కమిటీ పోలవరంపై అధ్యయనం చేసి… పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్రానికి కూడా ఏపీ సర్కార్ ఇచ్చింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆధారాలను కేంద్రం అడగడంతో… తాము ఆ నివేదికను విశ్వసించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం… సమాధానం పంపింది. పోలవరంలో అవకతవకలు జరగలేదని.. లేఖ రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పీటర్ కమిటీ అమరావతిపైనా.. అదే తరహా నివేదిక ఇచ్చింది.
అయితే.. ఈ సారి రాజధానిలో అవినీతి జరిగిందని కాకుండా… దుబారా జరిగిందని నివేదిక ఇవ్వడం … ఆసక్తికరంగా మారింది. అవినీతి జరిగిందని… నివేదిక ఇస్తే… న్యాయపరంగా ఎలా నిర్ధారించారనే ప్రశ్నలు వస్తే.. చిక్కులు ఎదురవుతాయనే.. పీటర్ కమిటీ సభ్యులు దుబారా అంటూ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం… ప్రభుత్వం రాజధాని నిర్మాణాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.