రాజధాని కేసుల్లో వాదించారంటూ నిరంజన్ రెడ్డి అనే లాయర్‌కు రూ. 96 లక్షలు ప్రభుత్వం ప్రజాధనం చెల్లించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడు నిరంజన్ రెడ్డి అర్హతలకు మించి ఫీజు చెల్లిస్తున్నారని.. ఆయన కన్నా సీనియర్లు తక్కువఫీజుకే వాదిస్తున్నారని తెలిసినా నిరంజన్ రెడ్డికి అప్పనంగా డబ్బులు ఇవ్వడానికే.. జీవో ఇచ్చారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు.. రాజధాని కేసుల్లో దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణలో నిరంజన్ రెడ్డి అసలు పాల్గొనలేదని… పిటిషనర్లు పేర్కొన్నారు. నిజానికి ఈ పిటిషన్లు వేసింది కూడా లాయర్లే. ప్రభుత్వం నిరంజన్ రెడ్డికి అత్యధిక మొత్తం చెల్లించడం.. ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసులో పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మితో పాట , ఏజీ ఎస్.శ్రీరామ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరినే బాధ్యులుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. నిరంజన్ రెడ్డికి ప్రభుత్వం రూ.96 లక్షలు చెల్లించాలన్న జీవోనే సంచలనం సృష్టిస్తే.. ఇతర లాయర్లు ఈ అంశంపై కోర్టుకెళ్లడం ఆసక్తి రేపుతోంది. నిజానికి ఏపీ సర్కార్ లాయర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తోంది. నిరంజన్ రెడ్డితో పాటు సీవీ మోహన్ రెడ్డి, ముకుల్ రోహత్గీ వంటి వారికి కోట్లలో చెల్లింపులు జరిగాయి. ఇంకా చాలా మందికి లాయర్లకు రూ. లక్షల్లో చెల్లింపులు జరిగాయి వీరంతా ప్రభుత్వం తరపునకూడా వాదిస్తున్నారు కానీ.. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన తరపున వాదించిన వారే. వాదిస్తున్నవారే. వారందరికీ.., తన అక్రమాస్తులకేసులు వాదించినందుకు గాను ప్రతిఫలంగా ప్రజల సొమ్మును.. రాజధాని కేసుల రూపంలో ఇస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.
ఇదో రకం క్విడ్ ప్రో కోగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో తన కేసుల్ని వాదించిన లాయర్లందరికీ ఇప్పుడు జగన్ ప్రజాధనం ఇచ్చేస్తున్నారని..దానికి ఇతర కేసుల కారణం చెబుతున్నారని అంటున్నారు. ఏ ప్రభుత్వం అయినా.. అత్యంత ముఖ్యమైన కేసులకు మాత్రమే బయట లాయర్లను నియమించుకుంటుది. సాధారణంగా అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలోని వ్యవస్థే … అన్ని కేసుల్లోనూ వాదనలు వినిపిస్తుంది. కానీ ఏపీలో మాత్రం జగన్ అక్రమాస్తుల కేసుల్లో లాయర్లే అత్యధికం కనిపిస్తున్నారు. భారీగా ప్రజాధనం .. ఫీజు రూపంలో పొందుతున్నారు. ఈ అంశం ఇప్పుడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఇచ్చారో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.