అమరావతిలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్నారైలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయా సంస్థలు స్పందించినా.. స్పందించకపోయినా.. ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో కావటి శ్రీనివాస్ అనే ఎన్నారై పిటీషన్ వేశారు. ఈ పటిషన్ ను తాము రిసీవ్ చేసుకున్నట్లు న్యాయస్థానం శ్రీనివాస్ కు లేఖ కూడా పంపంది. శ్రీనివాస్ బృందం ఐక్యరాజ్య సమితిలోనూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన, మహిళలపై జరుగుతున్న దాడుల పై వీడియో సాక్ష్యాలను ఆ పిటిషన్‌కు జత చేశారు.
అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగుతోందని ఎన్నారైలు అంటున్నారు. కావటి శ్రీనివాస్ వేసిన పిటీషన్ ను ప్రత్యేక ప్రక్రియ ద్వారా పరిశీలిస్తామని.. యునైటెడ్ నేషన్స్ అధికారులు హామీ ఇచ్చారు. అమరావతిలో మానవహక్కుల ఉల్లంఘన పై లండన్ లోని ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ లో కూడా పిటిషన్ వేసేందుకు కావటి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఎన్నారైలు చెబుతున్నారు.
అమరావతి రాజధానిగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఎన్నారైలు పెట్టుకున్న అంచనాను… కొత్త ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దాంతో.. అమరావతి కోసం … పోరాడాలని నిర్ణయించుకున్నారు. రైతులకు మద్దతుగా ఉండాలని తమ వంతు పోరాటం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లి.. ఏపీ సర్కార్ పై ఒత్తిడి పెంచాలనుకుంటున్నారు.