హైకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా…కార్యనిర్వాహక రాజధానిగా విశాఖలో పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం వేరే మార్గాలను అన్వేషిస్తోంది. స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో నిర్మాణాలు ప్రారంభించేందుకు.. కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలు కేటాయిస్తూ.. ప్రభుత్వం అఘమేఘాలపై జీవో విడుదల చేసింది. స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రారంభించడం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిగిన కొంత సేపటికే.. ఈ జీవో విడుదల కావడం.. అందులో అర్జంట్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం అధికారవర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇప్పటికే శంకుస్థాపన జరిగిపోయిందని ప్రచారం జరుగుతున్న స్టేట్ గెస్ట్ హౌస్‌కు అవసరమైన 30 ఎకరాల స్థలం ప్రస్తుతం గ్రే హౌండ్స్ అధీనంలో ఉంది. ఈ స్థలాన్ని గెస్ట్‌హౌస్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్‌కు బదలాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన.. 300 ఎకరాలలో 30 ఎకరాలను ఏపీ స్టేట్ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి కేటాయిస్తున్నట్లుగా జీవో నెంబర్ 1353ను సాధారణ పరిపాలనాశాఖ తరపున ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసేశారు.
అంతకతు ముందు స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గెస్ట్ హౌస్ కు ప్రభుత్వం భూమి పూజ చేయడం కోర్టు ధిక్కరణేనని.. రాజధాని బిల్లులపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు న్యాయవాది నిదేష్ గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి భవన్ ఐదెకరాలలో ఉందని..అందులో 350 గదులు ఉంటాయని… కానీ స్టేట్ గెస్ట్ హౌస్‌కు 30 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడం చూస్తే కార్యనిర్వాహక రాజధాని పనులను ప్రభుత్వం చేపట్టినట్టయిందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వచ్చిన గంటలోనే.. ప్రవీణ్ ప్రకాష్..స్టేట్ గెస్ట్ హౌస్‌కు భూమిని బదలాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.