పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపల్, పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మున్సిపల్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించాలని ఎస్ఈసీ నిర్ణయించారు. పరిషత్ ఎన్నికల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు.కానీ రాజకీయ పార్టీలు ఈ విషయంలో అసంతృప్తికి గురయ్యాయి. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని .. కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదని.. అంతే కాకుండా.. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అవుతుందని ఇప్పుడా ప్రక్రియ కొనసాగించడం కరెక్ట్ కాదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశంతో పాటు జనసేన కూడా పిటిషన్లు దాఖలు చేసింది.
విచిత్రం ఏమిటంటే పరిషత్ ఎన్నికల విషయంలో ఏకగ్రీవాల విషయంలో విచారణ జరపాలని ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ వాదనకు కాస్త మద్దతుగా హైకోర్టు తీర్పు వచ్చింది. ఫామ్ -10 ఇచ్చిన చోట విచారణ వద్దని ఆదేశించింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ… అసలు కొత్త నోటిఫికేషన్ కావాలని .. పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతున్నాయి. కోర్టు కూడా ఎన్నికల వివాదాల విషయంలో మధ్యే మార్గంగా ఉత్తర్వులు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.
ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాత నోటిఫికేషన్ రద్దు చేసి ..కొత్తగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నాయి. ఈ పిటిషన్లపై విచారణలో ఒక వేళ ఎస్ఈసీ కూడా తన అభిప్రాయం అదేనని కోర్టుకు చెబితే… ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కోర్టుల్లో ఈ పిటిషన్లన్నీ పరిష్కారం అయితేనే ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే… వాయిదాలు పడినా ఆశ్చర్యం లేదంటున్నారు