అందమైన టెన్నిస్ తారల్లో ఒకరైన పెట్రా క్విటోవాకు ఈ మధ్య విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. చెక్ రిపబ్లిక్ కు చెందిన ఈ టెన్నిస్ స్టార్, చైనా ఓపెన్ టోర్నీ నుంచి ఊహించని విధంగా నిష్క్రమించింది. డబ్ల్యు టి ఎ చైనా ఓపెన్ మొదటి రౌండ్లోనే పెట్రా ఓటమి చవి చూడటం సంచలనం కలిగించింది. ప్రత్యర్థి సరా ఎరానీ వీర విహారం ముందు క్విటోవా నిలువలేకపోయింది. ఈ టోర్నీలో పెట్రా క్విటోవా రెండో సీడ్ గా బరిలోకి దిగింది. వరస సెట్లలో పరాజయం పాలైంది. మొదటి సెట్లో సరా 7-5 స్కోరుతో నెగ్గింది. రెండో సెట్లో అయినా క్విటోవా తన స్థాయికి తగ్గట్టు ఆడుతుందని అభిమానులు ఎదురు చూశారు. కానీ సరా దూకుడు పెంచడంతో సెట్ తో పాటు మ్యాచ్ కూడా అమె వశమైంది. రెండో సెట్లో 6-4తో సరా విజయం సాధించింది.
పెట్రా క్విటోవా సింగల్స్ మ్యాచ్ లు ఎంతో స్టామినాతో ఆడుతుంది. బలమైన షాట్లతో ప్రత్యర్థిమీద పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే గ్రాండ్ స్లాం టోర్నీల్లో ఆమె విజేతగా నిలవడం సాధ్యం కావడం లేదు. ఒక్క వింబుల్డన్ లోనే మహిళల సింగ్స్ లో విజేతగా నిలిచింది.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రెండు సార్లు క్విటోవా గెలవడం విశేషం. 2011, 2014లో ఈ టైటిల్ విజేతగా నిలిచింది. కానీ మిగతా మూడు గ్రాండ్ స్లాం టోర్నీల్లో మాత్రం టైటిల్ గెలవలేక పోయింది. క్వార్లర్స్, సెమీప్ వరకూ వెళ్లి వెనుదిరుగుతోంది. వచ్చే ఏడాదైనా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో దూకుడు పెంచి టైటిల్స్ ఎగరేసుకు పోవాలని ఉవ్విళ్లూరుతోందీ 25 ఏళ్ల టెన్నిస్ తార. ఇంతకీ ఈ భామ ప్రైజ్ మనీ సంపాదన బాగానే ఉంది. అంది ఎంతనుకుంటున్నారు? దాదాపు 2 కోట్ల డాలర్లు. అంటే 120 కోట్ల రూపాయలకు పైమాటే.