గత నెల రోజుల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండుసార్లు తగ్గాయి. మళ్ళీ నిన్న అర్ధరాత్రి నుండి మరోసారి తగ్గాయి. పెట్రోల్ పై లీటరుకి రూ.2.43, డీజిల్ పై లీటరుకి రూ. 3.60 తగ్గింది. సబ్సీడీ లేని గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా తగ్గింది. 14.2కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 23.50 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, రూపాయి-డాలరు మార్పిడి రేటు తగ్గడం వలన పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినట్లు ఇండియన్ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
మే నెల మొదట్లో లీటరు రూ. 63.16 ఉన్న పెట్రోల్ ధర క్రమంగా పెరుగుతూ జూలై 16కి రూ.66.90కి చేరుకొంది. మళ్ళీ జూలై నెలాఖరుకి అంటే నిన్నటికి రూ.64.47కి దిగివచ్చింది. అదేవిధంగా మే 1వ తేదీన లీటరు డీజిల్ ధర రూ.49.57 ఉండగా అది మే 15వ తేదీకి రూ.52.28కి చేరుకొంది. మళ్ళీ నిన్న అర్ధరాత్రికి రూ.46.12కి తగ్గింది. పెట్రోల్, డీజిల్ ధరలలో ఈ హెచ్చు తగ్గులు చూస్తుంటే మూడడుగులు ముందుకి రెండు అడుగులు వెనక్కి నడుస్తునట్లుంది. కేంద్ర ప్రభుత్వం వీటి ధరల స్థిరీకరణకు ఏమయినా చేయగలిగితే, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది.