ఎన్నికలు పూర్తవడమే ఆలస్యం… పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరుగుతున్నా, ఎన్నికల పుణ్యమా అని మనదేశంలో వాటి ప్రభావం వెంటనే ప్రజలపై పడకుండా ఆపుతూ వస్తున్నారు. కానీ, ఎన్నికలు ముగియగానే పెట్రో వాత తప్పదనే సంకేతాలే చమురు సంస్థల నుంచి వస్తున్నాయి. ధరలు పెంచుతామంటూ, తమకు వేరే మార్గం లేదంటూ ఇప్పటికే ప్రభుత్వంపై పెట్రో సంస్థల ఒత్తిడి చాలా ఉందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పెంపు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో పీపా ముడి చమురు ధర పెరగ్గానే, వెంటనే పెట్రోల్, డీజిల్ ధరను మన చమురు సంస్థలు పెంచేస్తాయి. కానీ, గడచిన ఆరు వారాల్లో అంతర్జాతీయ మార్కెట్ లో పీపా ముడి చమురు ధర 12 శాతం పెరిగింది. దీంతోపాటు, ఇరాన్ పై పెరిగిన ఆంక్షల నేపథ్యంలో కూడా ధరలు పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు. అయినాసరే, మన మార్కెట్ లో ధరలు పెరగలేదు. కారణం ఎన్నికలే! ఎలక్షన్స్ పూర్తయ్యే వరకూ ధరలు పెంచొద్దంటూ చమురు సంస్థలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చిందని సమాచారం. కాబట్టి, చమురు సంస్థలు స్పందించలేని పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. అయితే, ముడి చమురు ధరలు 12 శాతం పెరిగిన తరువాత కూడా ధరలు పెంచకుండా ఏం చెయ్యగలమనీ, ప్రత్యామ్నాయ మార్గం తమకూ లేదని సంస్థలు అంటున్నాయి.
ఎన్నికలు పూర్తవగానే పెట్రోల్, డీజిల్ పై కనీసం రూ. 5 చొప్పున వడ్డన తప్పదని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో కొలువుదీరే ప్రభుత్వం ఏదైనా సరే, ముందుగా ఈ చమురు ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి, మనదేశంలో పెట్రోల్, డీజిల్ అసలు ధరల కంటే… వాటిమీద విధించిన పన్నుల భారమే ఎక్కువ. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ధరలు తగ్గే అవకాశం ఉందని ఎప్పట్నుంచో వినిపిస్తున్న వాదన. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ఒప్పుకోవడం లేదు. నిజానికి, ఎన్నికల ప్రకటనకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. ఆ సందర్భంలో ఏపీతో సహా కొన్ని రాష్ట్రాలు వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు పన్నుల్ని కాస్త తగ్గించాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నులు తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది. లేదంటే, సామాన్య ప్రజలపై భారం భారీగా పడే అవకాశం ఉంది.