పెట్రోలు లీటరు 75 రూపాయలనుకుని జేబులో ఓ 150 రూపాయలు పెట్టుకుని బంకుకు వెళ్ళడం ఇక కుదరదు. ఎందుకంటే మే ఒకటో తేదీనుంచి పెట్రోలు ధరలు రోజూ మారతాయట. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అనుసరించబోతున్నారట. కంగారు పడకండి. దేశంలోని ఐదు నగరాలలో తొలుత దీనిని ప్రవేశపెడతారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జార్ఖండ్‌లోని జంషెడ్పూర్, కేంద్రపాలిత ప్రాంతాలైన చండీఘర్, పుదుచ్చేరీలలో ఇవి కార్మిక దినోత్సవం నాటి నుంచి అమలులోకి వస్తాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అంటే ఈ నగరాల వారికి పెట్రో బాంబు 15రోజులకొకసారి కాకుండా ప్రతిరోజూ పేలుతుందన్న మాట. తగ్గితే సరే. పెరిగితే ఆ భారాన్ని భరించాల్సిందే. దేశవ్యాప్తంగా 95శాతం అంటే 58వేల పెట్రోలు పంపులను నిర్వహిస్తున్న ఐఓసీ, బీపీసీఎల్, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలు ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును అమలు చేస్తాయి. ప్రస్తుతం ప్రతినెలా ఒకటి, 16వ తేదీలలో ధరలను సమీక్షించి, పెంచడమో, తగ్గించడమో చేస్తున్నారు. తాజా ప్రాజెక్టు విజయవంతమైతే, దీన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చేస్తారు. మార్కెట్‌కు అనుసంధానమైన ధరల విధానం దిశగా ప్రయాణం చిట్టచివరకు ప్రారంభించామని ఐఓసీ చైర్మన్ బి. అశోక్ తెలిపారు. ఈ విధానం వల్ల ధరలలో తేడా తొలగిపోతుందని ఆయన అంటున్నారు. 2010 జూన్ నుంచి పెట్రోలు ధరలను నిర్ణయించే బాధ్యతను కేంద్ర వదిలించేసుకుంది. 2014 అక్టోబర్ నుంచి డీజిల్‌కూ దీనిని విస్తరించారు. అప్పుడప్పుడు దీనిపై రాజకీయ ఒత్తిళ్లు పడుతూనే ఉన్నాయి. ఈ మూడు సంస్థల మధ్య రేట్ల తేడా కేవలం పైసలలోనే ఉంది. పెట్రోలును లీటరుకు ఐఓసీ ఢిల్లీలో 66.29కీ, బీపీసీఎల్ 66.37కు, హెచ్పిసీఎస్ 66.48కి అమ్ముతున్నాయి. పెట్రోలు ధరల రోజు వారీ నిర్ణయం లాభమో నష్టమో తేలడానికి కొద్ది నెలలు ఆగాలి. ఈ విధానం వల్ల మార్కెట్లో అవినీతి పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. బంగారం, వెండి ధరలను దీనికి ఉదాహరణగా చూపుతున్నారు.
Subrahmanyam vs Kuchimanchi