ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేకపోతూండటంతో.. ఏపీ సర్కార్ మరోసారి ప్రజల్ని బాదేసింది. కొద్ది రోజుల కిందటే.. పెట్రోల్, డీజీల్‌పై పన్ను వడ్డించిన ఏపీ సర్కార్ ఇప్పుడు మరోసారి అదే వాత పెట్టింది. పెట్రోల్‌పై లీటర్‌కు 76పైసలు.. డిజీల్‌పై.. రూపాయి చొప్పున వడ్డించింది. పెంపు వెంటనే అమల్లోకి వస్తుంది. కొద్ది రోజుల కిందట పెంచిన పన్నులతో పెట్రోల్‌పై 31 శాతం పన్ను ప్లస్ రెండు రూపాయల సర్‌చార్జి అమల్లోకి ఉంది.ఇప్పుడు 31శాతం పన్నుతో పాటు రూ.2.76 సర్ చార్జీ వసూలు చేస్తారు. అంటే లీటర్‌కు 76 పైసలు పెరిగినట్లవుతుంది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను.. రూ. 2 సర్ చార్జీగా ఉండేది. ఇప్పుడు.. సర్ చార్జీని రూ. 3.07గా నిర్ణయించారు. అంటే రూపాయి ఏడు పైసలు.. ఒక్కో లీటర్‌పై పెంచారు.
అప్పట్లో జగన్ చెప్పినట్లే ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే..!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉండేవి. అప్పట్లో వరసగా రేట్లు పెరుగుతూండటంతో.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు.. రూ. రెండు ధరను ప్రభుత్వం తగ్గించింది. దాంతో పొరుగు రాష్ట్రాల ధరలతో సమానం అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పెట్రోచార్జీలపై బాదేశారు. ఇప్పుడు.. మళ్లీ దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధరలున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
క్రూడాయిల్ ధర 50 డాలర్లకు పడిపోయినా కేంద్రమూ తగ్గించదు..!
వాస్తవానికి అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బాగా పడిపోయాయి. 2014లో క్రూడాయిల్ బ్యారెల్ 110 డాలర్ల వరకూ వెళ్లింది. అప్పట్లో.. పెట్రోల్ ధర 80 దరిదాపుల్లో అమ్మేవారు. ఇప్పుడు.. క్రూడాయిల్ ధర 50 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. కానీ పెట్రోల్ ధర 80 రూపాయలకు అటూ ఇటూగానే అమ్ముతున్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు.. రేట్లు తగ్గించడం… పెరిగితే పెంచడం అనే విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలో పెరిగితే పెంచడమే తప్ప… తగ్గితే తగ్గించడమే ఆలోచన చేయడం లేదు. పెద్ద ఎత్తున పెట్రో పన్నుల ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వం మిగుల్చుకుంటోంది.
రోజువారీ ఖర్చుల కోసం కూడా పెట్రో పన్నులను బాదేస్తున్న ఏపీ సర్కార్..!
కేంద్ర ప్రభుత్వానికి తోడు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. పెట్రోల్, డీజీల్‌పై .. లీటర్‌కు రూపాయి..రూపాయి చొప్పున బాదేస్తూ.. ఆదాయవనరులుగా చేసుకుంటున్నాయి. సాధారణంగా పెట్రోల్ ధర 80 రూపాయలు అయితే.. అసలు ధర పాతిక రూపాయలు మాత్రమే. కేంద్ర, రాష్ట్రాల పన్నులు సర్‌చార్జీలు ఒక్కో లీటర్‌పై…యాభై రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అది చాలదన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… మరింతగా బాదేస్తోంది.