విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐ.ఐ.ఎం.)ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు విశాఖ నగరానికి మరొక ఉన్నత విద్యా సంస్థ మంజూరు అయ్యింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రాలో నెలకొల్పవలసిన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో నెలకొల్పేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
యూనివర్సిటీకి శాస్విత భవనాలు నిర్మించేవరకు, ఆంధ్రా యూనివర్సిటీలో తాత్కాలిక భవనంలో ఈ విద్యా సంవత్సరం నుంచే శిక్షణా తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకోసం పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఆంధ్రా యూనివర్సిటీ ఒక అవగాహనా ఒప్పందం కూడా చేసుకొంది. 2016 నుండి మూడేళ్ళ పాటు ఆ ఒప్పందం అమలులో ఉంటుంది. ఈ మూడేళ్ళలో ఆంధ్రా యూనివర్సిటీయే పెట్రోలియం యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ వంటి అన్ని వ్యవహారాలు చూసుకొంటుంది. ప్రస్తుతం ఐ.ఐ.ఎం.కూడా తాత్కాలిక ప్రాతిపాదికన ఆంధ్రా యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసారు. విశాఖ శివార్లలో గంభీరం అనే గ్రామంలో దానికి శాశ్విత భవనాలు నిర్మించే వరకు అది కూడా అక్కడే నిర్వహించబడుతుంది.