విశాఖ జైల్లో ఫోన్లు , గంజాయి దొరకడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. హోంమంత్రి అనిత జైలును తనిఖీ చేశారు. తాము చాలా సీరియస్ గా ఉన్నామని అందుకే సోదాలు చేసి ఎమేమి ఉన్నాయో బయటకు తీస్తున్నామని అంటున్నారు. అయితే ఇలా దొరకడం, పట్టుకోవడం తప్పన్నట్లుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలనలో వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయని అందుకే జైళ్లలో ఫోన్లు, గంజాయి దొరుకుతున్నాయన్నారు. సోదాలు చేసి పట్టుకుంటే అభినందించాలి కానీ అమర్నాథ్ ఇలా భయపడుతున్నారేమిటా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
గుడివాడ అమర్నాథ్ భయం ఎందుకో తాజాగా బయటపడింది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత తేలింది ఏమింటంటే..జైల్లో బయటపడిన ఫోన్ల ఐఎంఈఐ ద్వారా కాల్ డేటా బయటకు తీస్తే ఆ ఫోన్లు వెళ్లింది వైసీపీ నేతలకే. ఫోన్లు దొరికింది.. ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్న నిందితుల బ్యారక్ లోనే. వారు నిత్యం వైసీపీ నేతలతో టచ్ లో ఉండి వ్యవహారాలు చక్క బెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు పూర్తి సమాచారం సేకరించడంతో కొంత మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒక వేళ జైలు నుంచి గుడివాడ అమర్నాథ్ కు కూడా ఫోన్ వచ్చి ఉంటే ఆయనకు కూడా గడ్డు పరిస్థితి తప్పదేమో ?
వైసీపీ హయాంలో పరిపాలన ఎవరు చేశారన్నది పెద్ద సస్పెన్స్ . రౌడీలు, ముఠా నాయకులదే రాజ్యం అయ్యేది. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పోలీసులే పెద్ద పెద్ద డ్రామా ఆడారు. ఏ విషయం బయటకు రానివ్వలేదు. ఈ విషయంలో పోలీసులు చెప్పిన కథను ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు ఈ కేసును బయటకు తీసి..మొత్తం గుట్టు రట్టు చేయాలని అనుకుంటున్నారు. అందుకు ఈ జైలు ఫోన్లు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.