శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్ని అందుకొంది. ఈ సినిమాతో నిర్మాతలకు మంచి లాభాలొచ్చాయి. నటన పరంగా శివ కార్తికేయన్, సాయి పల్లవిలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ ఇప్పుడు ఓ విద్యార్థి ఈ సినిమా నిర్మాతలపై దావా వేశాడు. తనకు కోటిరూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే… ఈ సినిమాలోని ఓ సందర్భంలో హీరోయిన్ (సాయిపల్లవి) హీరోకు (శివ కార్తికేయన్)కు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ తనదే అని, కానీ దాన్ని సాయి పల్లవి ఫోన్ నెంబర్ అని భావించిన అభిమానులు తనకు వరుసగా ఫోన్లు చేస్తున్నారని, ఆ ఫోన్ల తాకిడికి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని, తనకు జరిగిన ఈ అసౌకర్యానికిగానూ చిత్ర నిర్మాతలకు తనకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని విఘ్నేశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించాడు. నిర్మాతలు కూడా ఈ విషయంలో లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకొన్నారు. సాధారణంగా సినిమాల్లో ఫోన్ నెంబర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వాడకంలో లోని ఫోన్ నెంబర్లు క్రియేట్ చేస్తుంటారు. తమ సొంత నెంబర్లు కూడా ఇచ్చి, ఇబ్బంది కొని తెచ్చుకొన్న సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తాయి. ఇది మరో రకం వ్యవహారం. అబ్బాయి నెంబర్ వాడారు కాబట్టి కొంతలో కొంత నయం. అదే అమ్మాయి నెంబర్ అయితే.. ఆ టార్చర్ వేరేలా ఉండేది. ఇక మీదట ఇలాంటి విషయాల్లో చిత్రబృందాలు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.