ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో చంచల్ గూడ జైల్లో రాధాకిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్న వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమ పేర్లను ఎందుకు బయటపెట్టి ఇరికించావని ప్రణీత్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా ప్రణీత్ రావు కన్నీటిపర్యంతమై క్షమాపణ కోరినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని నమ్మకంతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ప్రణీత్ రావు ఆ ముగ్గురితో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు మనం తప్పించుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. ఆ ముసలోడి ఆదేశాల మేరకు ఇదంతా చేసినట్లుగా చెప్తూ ప్రణీత్ రావు కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. విచారణలో ప్రణీత్ రావు వాంగ్మూలంతో ఈ కేసు నుంచి తప్పించుకోవడం కష్ట సాధ్యమని రాధాకిషన్ రావు అసహనం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ కేసులో కింగ్ పిన్ ప్రభాకర్ రావే. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు అర్థం అవుతోంది. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఆయనను ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి రానుండటంతో ఆ తదుపరి చర్యలు కీలకంగా ఉంటాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. అవసరమైతే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని మరిన్ని విషయాలను తేల్చాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.