ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్ది పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జూబ్లిహిల్స్ లోని గెస్ట్ హౌజ్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనేక అంశాలు చర్చకు వచ్చేవని తేలడంతో పోలీసులు ఆ గెస్ట్ హౌజ్ పై దృష్టి సారించారు.ఆ అతిథి గృహం బీఆర్ఎస్ అధినేత కుటుంబ సభ్యుడికి అత్యంత సన్నిహితుడైన ఓ ఎమ్మెల్సీదని తెలుస్తోంది. ఇదే వేదికగా భేటీలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీ నేతలను ఫోన్ ట్యాప్ చేసే వారని సమాచారం.
ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలకమైన డెన్ ను ఈ గెస్ట్ హౌజ్ నుంచే నడిపించారని… ఇది రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసినట్లుగా తేలింది. రేవంత్ ను టార్గెట్ చేసేందుకు సులువుగా ఉంటుందని ఇక్కడే డెన్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి..? ఈ తర్వాత ఎలాంటి ప్రణాళికలు రచించాలి.? అనే అంశాలపై ఇక్కడి నుంచే వ్యూహం రచించేవారనే చర్చ నడుస్తోంది. దీంతో ఈ కేసులో ఈ గెస్ట్ హౌజ్ వ్యవహారం కీలకంగా మారిందని పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, రాదాకిషన్ రావు, భుజంగరావులు ఈ గెస్ట్ హౌజ్ గురించి కీలక సమాచారం వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వారు చెప్పిన సమాచారం ఆధారంగా గెస్ట్ హౌజ్ ను పోలీసులు పరిశీలించారు. అయితే.. అక్కడ ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ధ్వంసం చేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ గెస్ట్ హౌజ్ యజమాని అయిన ఎమ్మెల్సీని విచారించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.