రాజకీయ అవసరాల కోసం నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. బయటపడితే .. అలా బయటపెట్టడం దేశ వ్యతిరేక చర్య అని ఆరోపించడం కామన్ అయిపోయింది. తాజాగా.. దేశంలో పెగాసుస్ ప్రకంపనలు పెరిగిపోతున్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సారి అదే వాదన అందుకుంది. దేశ పురోభివృద్ధిని.. అడ్డుకోవడానికి కొంత మంది విదేశీ శక్తులతో కలిసి.. ఈ ట్యాపింగ్ వ్యవహారంపై రచ్చ చేస్తున్నారని ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇజ్రాయిలీ నిఘా వ్యవస్థ పెగాసుస్ ద్వారా.. గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ సహాఅనేక మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి రోజుకు ఒక్కో సంచలన విషయం వెల్లడవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూండటంతో .. ఇక మార్గం లేదన్నట్లుగా.. భారత్‌పై విదేశాలు చేస్తున్న కుట్రంటూ చెప్పడం ప్రారంభించారు. భారత ఇమేజ్ను దెబ్బ తీసేందుకు.. దేశం ఎంతో ముందుకు వెళ్తూంటే వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా హోంమంత్రి అమిత్ షాతో పాటు.. ఐటీ మంత్రి వైష్ణవ్‌లు ప్రకటనలు చేస్తున్నారు. దేశంలో కఠినమైన చట్టాలున్నాయని అందుకే.. ట్యాపింగ్ చేయడం అంత సులువు కాదని ఐటీ మంత్రి చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని… మీడియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ట్యాప్ అయినప్పుడు ఆయన కేంద్రమంత్రిగా లేరు.
కానీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా అదీ కూడా ఐటీ మంత్రిగా ఉన్నారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసుకుని ఆయన మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో కానీ ఇప్పుడు ఎలాంటి ట్యాపింగ్ జరగలేదని గట్టిగా వాదించాల్సిన బాధ్యతల్లో ఉన్నారు. పెగాసుస్ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఎలాంటి విచారణలకు ఆదేశించే ధైర్యం కూడా చేసే పరిస్థితి లేదు. రాఫెల్ వివాదంలో ఆరోపణలు వచ్చినప్పుడు.. ఎలా రూల్ అవుట్ చేశారో.. అలాగే… వ్యవహరించి.. ఎలాంటి ట్యాపింగ్ లేదని దులిపేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కానీ .. కేంద్రం రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్ చేయలేదంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలే దానికి కారణంగా చెప్పుకోవచ్చు. దేశంలో అధికారాన్ని ఉపయోగించుకుని .. వ్యక్తిగత స్వేచ్చను హరించే దారుణమైన దుశ్చర్యలకు రాజకీయ పార్టీలు పాల్పడుతున్నాయనడానికి పెగాసిస్నే ఉదాహరణ అని.. నిపుణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.