ఏపీ అధికారులు కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల వర్క్ షాప్‌లోకి చొరబడిన ఓ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ను పట్టుకున్న టీడీపీ నేతలు.. అతని ఫోన్ సెర్చ్ చేస్తే.. కేశినేని చిన్ని ఫోన్ లో ఉన్న వివరాలు బయటపడ్డాయి. దీంతో మీడియా ముందు బొండా ఉమ.. ఫోన్ ట్యాపింగ్ డీటైల్స్ బయట పెట్టారు.
నిజానికి ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అనేది విచ్చలవిడిగా సాగుతోందని అధికార వర్గాలన్నింటికీ తెలుసు. తాము పెగాసస్ కొన్నామని గుడివాడ అమర్నాథ్ ఓ సారి ఒప్పుకున్నారు. మాజీ మంత్రి నారాయణను టెన్త్ పేపర్ల లీక్ అంటూ దొంగ కేసులో అరెస్టు చేయడానికి ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి ఒప్పుకున్నారు. గతంలో పయ్యావుల కేశవ్… ఫోన్ ట్యాపింగ్ ఏ ఏజెన్సీతో చేయిస్తున్నారో.. వారికి డబ్బులు ఏ రూపంలో చెల్లిస్తున్నారో కూడా బయటపెట్టారు. ఆ తర్వాత ఆయనపై వేధింపులు పెరిగాయి.
ఇక కోటంరెడ్డి బయట పెట్టిన ట్యాపింగ్ ఆధారాలతో ఉలిక్కి పడి… ఆయన ఫోన్ చేసిన వ్యక్తిని తెర ముందుకు తెచ్చి.. నేనే రికార్డు చేశానని చెప్పించారు. కానీ అలా చెప్పించడం వల్ల అడ్డంగా దొరికిపోయామన్న సంగతిని ఇంటలిజెన్స్ చీఫ్ మర్చిపోయారు. తెలంగాణలో జరుగుతున్న ట్యాపింగ్ కేసు ఏ తీరుగా సాగుతుందో… ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో అదే రీతిన సాగే అవకాశం ఉంది. సాక్ష్యాలను తుడిచేయడానికి సాధ్యం కాదని పోలీసు ఉన్నతాధికారులకూ తెలుసు.