తెలంగాణలో సంచలనానికి కేంద్రబిందువుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత నుంచే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమించిందని…ఆ తర్వాత ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కోసం టీమ్ ను ఏర్పాటు చేశారని రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ లో ‘ బీఆర్ఎస్ సుప్రీమో ‘ అనే ప్రత్యేకంగా పేర్కొనటం బిగ్ డిబేట్ గా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రత్యేకంగా ప్రణీత్ రావును ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రభాకర్ రావు తీసుకొచ్చారని రాధాకిషన్ రావు వెల్లడించారు. ఆ తర్వాత టీమ్ ను ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం వంటివి జరిగాయన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ను విభేదించిన నేతల కదలికలపై కన్నేసి ఉంచామన్నారు. బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు చట్ట విరుద్దంగా పని చేసినట్లు రాధాకిషన్ రావు అంగీకరించారు.
2018 ఎలక్షన్స్ తోపాటు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు అంగీకరించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు చెందిన డబ్బు కనిపిస్తే దానిని సీజ్ చేయడం , బీఆర్ఎస్ డబ్బు తరలించే వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా పంపినట్లు చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో రఘునందన్ రావు బంధువుకు చెందిన కోటి రూపాయలను సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి నగదును సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీమో అని పేర్కొనడంతో బీఆర్ఎస్ బాస్ కు నోటీసులు వెళ్లనున్నాయా..? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రణీత్ రావు పలు విషయాలను వెల్లడించగా తాజాగా రాధాకిషన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టం చేయడంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడటం అసాధ్యమని అంటున్నారు న్యాయనిపుణులు.