తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్.ఐ.బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహరం మరో మలుపు తిరిగింది. అమెరికాలో ఉంటూ విచారణకు దూరంగా ఉంటున్న ఆయన గత నెలలో పోలీసులకు రాసిన లేఖ బయటకొచ్చింది.
తను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, గుండె- క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు. తాను విచారణకు దూరంగా ఉండనని… ఆరోగ్యం కుదుటపడగానే ఇండియాకు వస్తానని, విచారణకు సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు. తాను ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రభాకర్ రావు ఎదురుదాడి చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులంతా ఐజీ ప్రభాకర్ రావు పేరు చెప్పారు. ఆయన ఆదేశాలతో పాటు పెద్దాయన సూచనతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అవసరం అయితే ఆయన పాస్ పోర్టు పై చర్యలు కూడా ఉంటాయని తెలంగాణ పోలీసులంటున్నారు.
ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఓ మీడియా సంస్థ చైర్మన్ శ్రవణ్ రావు కూడా ప్రస్తుతం విదేశాల్లోనే ఉన్నారు. విచారణలో తన పేరు బయటకు వచ్చేప్పటికే శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లిపోయారు.