తెలుగు బిగ్ బాస్ 3కి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ షో నిర్వహణని అడ్డుకోవాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్ఞం దాఖలు చేశారు. యువతరాన్ని, ముఖ్యంగా పిల్లల్ని చెడుదోవ పట్టించేలా ఈ షో ఉంటోందని, సినిమాని ఎలా సెన్సార్ చేస్తారో, అలానే ఈ షోనీ సెన్సార్ చేసి ఆ తరవాతే ప్రసారం చేసేలా చూడాలని, సెలక్షన్ పేరుతో మహిళల్ని వేధిస్తూ, కమిట్మెంట్ పేరిట ఒత్తిడికి గురి చేస్తున్న `స్టార్ మా` యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ పిటీషన్లో్ కోరారు. రాత్రి 11 గంటలకు దాటాకే ఈ కార్యక్రమం ప్రసారం చేయాలని న్యాయస్థానానికి పిటీషన్ దారుడు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పది మంది ప్రతివాదుల్ని చేర్చారు. అందులో బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున కూడా ఉన్నారు. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు.. ఈనెల 23న విచారణని వాయిదా వేసింది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెలబ్రెటీలు ఎవరన్నది దాదాపుగా తేలిపోయింది. అయితే అధికారికంగా మాత్రం 21నే `మా` యాజమాన్యం వెల్లడించనుంది. ప్రారంభానికి ముందే అనేక వివాదాలకు నెలవైన బిగ్ బాస్ షో.. మున్ముందు ఇంకెన్ని విమర్శల్ని, వివాదాలనూ ఎదుర్కుంటుందో..?