ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రంగులు వేయడానికి , తీయడానికి రూ. నాలుగు వేల కోట్ల ప్రజా ధనం వృధా అయిందని.. వాటిని బాధ్యులైన వారి నుంచి వసూలు చేయాలంటూ… హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అందులో నీలం సాహ్ని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్పై విచారణలో హైకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని తప్పు పట్టింది. వారిని వ్యక్తిగతంగా ప్రతివాదులుగా ఎందుకు చేర్చాలని ప్రశ్నించింది. సరిగ్గా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అధికారికంగా ఆదేశాలు ఇచ్చి మరీ.. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వైసీపీ రంగులు వేశారు. వీటికి పెద్ద మొత్తంలో ఖర్చుచేశారు. ఇలా రంగులు వేయడం.. చట్ట విరుద్ధమంటూ.. కోర్టులోపిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు… రంగుల్ని తొలగించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. అయినా మార్చలేదు. రెండు సార్లు ఇలా సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన తర్వాత .. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అప్పుడు రంగుల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చారు.
రంగుల వేయడానికి తొలగించడానికి వేల కోట్లు ఖర్చయ్యాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంత ప్రజాధనం వృధా చేయడం కరెక్ట్ కాదని.. బాధ్యులైన వారి నుంచి వసూలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఎంత ఖర్చు అయిందనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. అయితే ఇప్పటికీ చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు కనిపిస్తూనే ఉన్నాయి. వివాదం సమసిపోయిందనుకున్న సమయంలో.. కొత్తగా పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలిచ్చిన వారికి ఇప్పుడు ఇబ్బందికర పరిణామం ఎదురయ్యే అవకాశం ఉందని లాయర్లు అంచనా వేస్తున్నారు.