హైదరాబాద్: సిక్కులపై బహుళ ప్రచారంలో ఉన్న సర్దార్జీ జోకుల గురించి అందరికీ తెలిసిందే. పార్టీలలో, ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో ఈ జోకులు తెగ పేలుతుంటాయి. అయితే ఈ జోకులు ఒక సామాజికవర్గాన్ని హేళన చేయటమే అవుతుందని, సిక్కుల సమానత్వ హక్కును ఉల్లంఘించటమేనని ఆరోపిస్తూ సుప్రీంకోర్ట్‌లో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలయింది. సిక్కులు తెలివితక్కువ వారని, మందబుధ్ధులని, మూర్ఖులని ఈ జోక్‌లలో చిత్రీకరిస్తూ ఉన్నారంటూ హర్వీందర్ చౌదరి అనే సిక్కు మహిళా న్యాయవాది సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు. ఇలా చేసేవారిపై జరిమానా విధించాలని కోర్ట్‌ను కోరారు.
సర్దార్జీలను చులకనగా చూపే జోకులు ఉన్న సుమారు 5,000 వెబ్సైట్లను నిషేధించటంగానీ, వాటిలో ఆ జోకులను తీసేయటంగానీ చేయాలని టెలికామ్, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖలకు ఆదేశాలివ్వాలని హర్వీందర్ అభ్యర్థించారు. ఈ జోకుల కారణంగా తాను న్యాయస్థానాలలో, విదేశాలతో సహా ఎన్నోచోట్ల హేళనకు గురయ్యానని తెలిపారు. హేళనకు గురికావలసి వస్తుందని తన పిల్లలు, పేర్ల చివరన సింగ్, కౌర్ చేర్చుకోబోమని చెప్పారని పేర్కొన్నారు.
అయితే ఎంతోమంది సిక్కులు ఈ జోకులను పట్టించుకోరని, అసలు వారుకూడా అలాంటి జోకులు చెబుతుంటారని కోర్ట్ వ్యాఖ్యానించింది. ప్రముఖ సిక్కు రచయిత, జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ ఈ జోకులపై ఒక పుస్తకాన్ని రాసిన విషయాన్ని గుర్తు చేసింది. ఎంతో మంది సిక్కులు ఈ జోకులను లైట్‌గా తీసుకుంటారని, అది అవమానించటంకిందకు రాదని, ఈ జోకులన్నింటిని ఆపమని పిటిషనర్ చేస్తున్న అభ్యర్థనను సిక్కులుకూడా వ్యతిరేకించొచ్చని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. దానికి పిటిషనర్ బదులిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో – బీహారీలు చాలా తెలివిగలవారని వ్యాఖ్యనించారని, అయితే తమ విషయానికొచ్చేటప్పటికీ అందరూ ఎగతాళి చేస్తుంటారని అన్నారు. దానికి న్యాయమూర్తులు స్పందిస్తూ, “దానిపై ఏమీ బాధపడకండి, ఆయన పంజాబ్ వచ్చినపుడు సిక్కులు చాలా తెలివిగలవారని అంటారు” అంటూ హాస్యోక్తి విసిరారు.
అయినా కేసుపై వాదనలు కొనసాగాలని, సమస్య సున్నితమైనదని పిటిషనర్ వాదించటంతో, న్యాయమూర్తులలోనే ఒక సిక్కు మతస్థుడు ఉన్నారని, వారికి ఈ కేసును బదిలీ చేయమంటారా అని న్యాయమూర్తి అడిగారు. అవసరంలేదని, ప్రస్తుత బెంచ్ ముందే ఈ కేసును తాను వాదిస్తానని చెబుతూ తన వాదనకు మద్దతుగా వివరాలను సేకరించటంకోసం కేసును ఒక నెల వాయిదా వేయాలని పిటిషనర్ కోరారు.