తమిళనాడులో అక్కడి హైకోర్టు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ..తీర్పు ఇచ్చిన వ్యవహారం కళ్ల ముందు ఉండగానే.. ఏపీలోనూ మద్యం విక్రయాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. మద్యం విక్రయాల సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదని…కోరనా వ్యాప్తికి అవకాశం ఉందని.. తక్షణం అమ్మకాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ..మాతృభూమి ఫౌండేషన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిది. మద్యం విక్రయాలపైనే కాదు.. పిటిషనర్ పలు అంశాలను..తన పిటిషన్లో పేర్కొన్నారు.
మద్యం చీప్ లిక్కర్‌ను పరీక్షలకు పంపాలని కోరారు. ప్రభుత్వం మద్య నిషేధం విధిస్తానని చెబుతోంది కాబట్టి ఇదే సరైన సమయం అని పిటిషనర్ వాదిస్తున్నారు. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా.. ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే దశళ వారీగా అమలు చేస్తోందన్నారు. బుధవారంలోపు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. మద్యం విక్రయాలపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే.. లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదు కాబట్టి.. డోర్ డెలివరీని పరిశీలించాలని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. కానీ మద్యం విక్రయాలను నిలిపివేయమని ఆదేశించలేదు. అదే సమయంలో కేంద్రం జారీ చేసిన లాక్ డౌన్ నిబంధనలు అసలు ఏ మద్యం షాపు వద్ద కూడా అమలు చేయడం లేదు. ఈ కారణంగా ఏపీ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి ప్రారంభమయింది.