ఫిరాయింపు నేతలకు ఎప్పుడూ ఆ సమస్య ఉంటూనే ఉంటుంది! అదేనండీ.. పార్టీ పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించుకోవాల్సిన అవసరం. వారు ఏ పరిస్థితుల్లో పార్టీకి వచ్చినా.. కొన్నాళ్ల తరువాత తామేంటీ అనేది నిరూపించుకోవాల్సిన సమయం ఒకటొస్తుంది. తాము చేరడం ద్వారా పార్టీకి అదనంగా ఒనగూరిన ప్రయోజనం ఏంటనేది చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి, ఇలా చేయాలని ఎవ్వరూ చెప్పరు! ఎవరికివారే పార్టీలో తమ ఉనికిని పటిష్టం చేసుకునే క్రమంలో ఇలా చేస్తుంటారు. ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ వైకాపా నుంచి చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది మంత్రి పదవులు కూడా దక్కాయి. అలాంటి నేతల్లో అమర్ నాథ్ రెడ్డి కూడా ఒకరు. నంద్యాల ఉప ఎన్నిక తరుణంలో ఆయన కాస్త క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ బాధ్యతల్ని బాగా తీసుకున్నారు. తనవంతు చేయాల్సిన కృషి చేశారు!
ఇప్పుడు కూడా ఆ కృషిని కొనసాగిస్తున్నారు! ఇంతకీ ఆ కృషి ఏంటంటే.. విపక్షం వైకాపా నుంచి నాయకుల్ని ఆకర్షించడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పించడం! వైసీపీకి చెందిన పీలేరు జెడ్పీటీసీ సభ్యుడు మల్లారెడ్డి భాషాని టీడీపీలో చేర్చారు. మంత్రి అమర్ నాథ్ రెడ్డి నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరింతమంది టీడీపీలోకి వచ్చే ప్రయత్నం జరుగుతోందనీ, రాబోయే రెండు నెలల్లో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని మంత్రి అమర్ నాథ్ ఈ సందర్భంగా చెప్పారు. మైనారిటీల కోసం తెలుగుదేశం ఎంతో కృషి చేస్తోందనే నమ్మకం ఆయా వర్గాల్లో పెరిగిందనీ, నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ విజయం అందుకు నిదర్శనం అన్నారు. పీలేరు నియోజక వర్గంలో ఇప్పటికే ఇద్దరు కీలక వైకాపా నేతలు వైకాపాను వీడారనీ, రాబోయే రోజుల్లో ఈ నియోజక వర్గంపై టీడీపీ మరింత పట్టు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నానితో కలిసి మరింతమంది వైకాపా నేతలతో మంథనాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. పీలేరు నియోజక వర్గంలోని వైకాపా ముఖ్యనేతలతోపాటు, జిల్లాలోని ఇతర నాయకులతో కూడా అమర్ నాథ్ రెడ్డి టచ్ లోకి వెళ్తున్నారనీ, రాబోయే రెండు నెలల్లో మరింతమందిని టీడీపీలోకి ఆహ్వానించాలనే లక్ష్యంతో ఆయన బిజీబిజీగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ రకంగా అమర్ నాథ్ రెడ్డి స్వామి భక్తిని నిరూపించుకునే పనిలో ఉన్నారన్నమాట! పార్టీకి పనికొచ్చే పనిచేయడం అంటే.. ఇతర పార్టీ నేతలకు వల వేయడమే అన్నమాట! అంతేగానీ, ఎలాగోలా అధికార పార్టీలో చేరాం కాబట్టి, ప్రజలకు ఉపయోగపడే నాలుగు పనులు చేయడం ద్వారా ఆదరణ పెంచుకోవచ్చు అనే కోణం నుంచి ఆలోచించరేమో! నాయకుల సంఖ్యను పెంచుకుంటే చాలు… అదే గొప్ప పని అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో ప్రజల మనోభావాలు, నాయకులు పార్టీలు మారింత సులువుగా ప్రజలు మైండ్ సెట్ మారుతుందా లేదా అనే చర్చ లేనే లేదు!