ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడో చార్జిషీటు సంచలనంగా మారింది. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్లు, ఈ మెయిల్స్ పత్రాలనుకూడా ఈడీ కోర్టుకు సమర్పించింది. దీంతో ఇతర చార్జిషీట్ల కన్నా ఈ చార్జిషీటు మరితం బలంగా కనిపిస్తోందని న్యాయవర్గాలు చెబుతున్నారు. ఇందులో కవిత వ్యవహారాలు ప్రధానంగా ఉన్నాయి. ఏ భూములు కొన్నారు.. ఎక్కడ కొన్నారు.. డబ్బులు ఎలా రూటింగ్ అయ్యాయో వివరాలు మొత్తం బయటకు తీశారు. ఇవన్నీ కవిత ఇచ్చిన ఫోన్లలో ఉండే సమాచారం ఆధారంగానే కాదు.. అసలు ఆమె నమ్ముకున్న బుచ్చిబాబు, పిళ్లై ఇద్దరూ ఈడీకి వివరాలు చెప్పడం వల్లనే సాధ్యమయిందని అంచనా వేస్తున్నారు.
మూడు రోజుల కిందట ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడన్న ప్రచారం జరిగింది. ఈ లీక్ ను.. ఈడీ వర్గాలే ఇచ్చాయి. ఆయన అప్రూవర్ పిటిషన్ వేస్తాడో లేదో కానీ ఆయన కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం బయట పెట్టేసినట్లుగా ఈడీ తాజా చార్జిషీట్లో స్పష్టమయింది. ఓ ఆడిటర్ చెప్పాలంటే.. దానికి ఇక తిరుగులేనట్లే భావించవచ్చు. దానికి తగ్గ ఆధారాలు ఉంటాయి. ఇక కవిత తన పేరును బినామీగా పెట్టుకున్నట్లుగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై పూర్తిగా చేతులెత్తేశారు. తన పేరు మీద నడుస్తున్నా అది తనది కాదని.. కవితదేనని ఆయన ఎప్పుడో చెప్పేశారు. దానికి తగ్గట్లుగానే ఈడీ కే్సును బిగించింది.
అరెస్ట్ కాకుండా కవిత ఇప్పటికైతే తప్పించుకున్నారు. కాలు ఫ్రాక్చర్ పేరుతో గత ఇరవై రోజులుగా ఆమె బయట కనిపించడం లేదు. ఈ మధ్యలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని ఓ సారి మెన్షన్ చేయించారు. అవన్నీ వర్కవుట్ అవుతాయో లేదో కానీ.. ఇప్పుడు కవిత మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. సాక్ష్యాలు పక్కాగా ఈడీ సేకరించింది.. తాజా చార్జిషీటు ద్వారా స్పష్టమయింది. అంత కంటే ముఖ్యంగా బుచ్చిబాబు, పిళ్లై అసలు విషయాలు చెప్పడంతోనే కవితకు తప్పించుకోలేనన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.