ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవితకు బినామీనని ఒప్పుకుని నిలువుగా ఇరికించేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఇప్పుడు తాను ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని కోర్టులో పిటిషన్ వేశారు. సాధారణంగా ఎవరైనా తూచ్.. తాను అలా అనలేదని.. సీబీఐ, ఈడీ అధికారులు కొట్టి చెప్పి సంతకం పెట్టించుకున్నారని ఇలాంటి యూటర్నుల సమయంలో ఆరోపిస్తూ ఉంటారు. కానీ రామచంద్ర పిళ్లై మాత్రం తాను ఆ వాంగ్మూలం ఈడీకి ఇచ్చానని ఒప్పుకుని.. ఇప్పుడు వెనక్కి తీసుకుంటానని పిటిషన్ వేశారు. దీంతో ఢిల్లీ సీబీఐ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ఒకసారి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుని దానికి భిన్నంగా మరో వాంగ్మూలం ఇస్తే.. దానికి ఎంత విశ్వసనీయత ఉంటుందనేది ప్రశ్నార్థకమే. అరుణ్ రామచంద్ర పిళ్లైను సీబీఐ, ఈడీ అధికారులు చాలా కాలంగా విచారిస్తున్నారు. దాదాపుాగ 29 రోజుల పాటు ఆయనను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే పిళ్లై వాంగ్మూలం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటన్నది ఆశ్చర్యకరంగామారింది.
ఒక వేళ ఆ వాంగ్మూలం నిజం కాకపోతే.. ఏ ఉద్దేశంతో కవిత పేరును తెరపైకి తెచ్చారన్నది తేలాల్సి ఉంటుంది. ఆయన తాను కవిత తరపునే వ్యాపారం చేస్తున్నానని చెప్పుకోవడానికి దారి తీసిన పరిస్థితులేమిటో వెల్లడి కావాల్సి ఉంటుంది. ఈ అంశం ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతోంది. తమను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని కవిత, కేటీఆర్ కూడా ఆరోపించారు. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఈ కేసులో మరిన్ని చిక్కు ముళ్లు పడే అవకాశం కనిపిస్తోంది. కవితను బయయటపడేయాలనుకుని ఇలా పిళ్లై తన వాంగ్మూలాన్ని్ మార్చుకుంటున్నట్లు తేలితే కేసు మరింత జఠిలం అయ్యే అవకాశం ఉంది.