శాసనమండలి రద్దు అంశంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ శాసనమండలి రద్దు గురించి లైట్ తీసుకుంది. ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని.. ఇప్పుడు శాసనమండలి రద్దు చేయాలని.. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అంతే కాదు.. రాబోతున్న శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. దీంతో వైసీపీ హైకమాండ్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏడాదిలో మెజార్టీ వస్తుందని… ఇప్పుడే కొత్తగా తెలిసినట్లుగా ఎందుకు ఇలా వ్యూహం మారుస్తున్నారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. మండలి రద్దు గురించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినప్పుడే..ఏడాదిలో మాకు మెజార్టీ వస్తుందని తెలిసినా .. అసలు ఈ పెద్దల సభ అనవసరం కాబట్టే రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పుడు మాత్రం ఉంటే పోలా అన్న పద్దతిలోకి వచ్చేశారని అంటున్నారు.
శాసనమండలి ద్వారా మంత్రివర్గంలోకి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను మంత్రి పదవి నుంచి తప్పించడానికే.. వైసీపీ హైకమాండ్.. మండలి ఎపిసోడ్ ను వాడుకున్నారన్న ప్రచారం వైసీపీలో అంతర్గతంగా జరుగుతోంది. వారిని రాజ్యసభకు పంపేశారు. ఎమ్మెల్సీ పదవికి నేడో రేపో రాజీనామా చేయబోతున్నారు. ఇక మంత్రి పదవులకు రాజీనామా చేయడం లాంఛనమే. అంతా అయిపోయాక.. ఇప్పుడు శాసనమండలి రద్దుపై.. పునారాలోచన చేస్తున్నట్లుగా వైసీపీ లీకులు ఇస్తోంది. దీంతో.. ఆ ఇద్దరితో పాటు..మిగతా వారికి కూడా.. వారిని మంత్రి పదవుల నుంచి తప్పించడానికే.. ఇదంతా చేశారని నమ్మాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు.
వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి స్వరాలను తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి పదవుల పందేరం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆయన దాదాపుగా రెండు వందల మందికి ఎమ్మెల్సీ పదవులు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడిప్పుడే… కొంత మంది బయటపడుతున్నారు. వారిని బుజ్జగించాలంటే ఏదో ఓ పదవి ఇవ్వాల్సిందే. ఎమ్మెల్సీ కన్నా పెద్ద పదవులు ఉండవు. ఇప్పుడు రాబోయే రోజుల్లో.. కనీసం ఇరవై ఎమ్మెల్సీ స్థానాలు తమకు వస్తాయని వైసీపీ లెక్కలు వేస్తోంది. వీటిని ఎందుకు పోగొట్టుకోవడం అన్న చర్చ కూడా ప్రారంభించేశారు. నిజంగా చిత్తశుద్ధితో మండలిని రద్దు చేయాలనుకుంటే… ఖాళీ అయ్యే వాటిని భర్తీ చేయరు. కానీ.. గవర్నర్ కోటా..ఎమ్మెల్యేల కోటా కూడా.. వైసీపీ అధినాయకత్వం భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. అంతా చూస్తే.. పాపం.. పిల్లి.. మోపిదేవి అనుకోవడం తప్ప..ఏమీ చేయలేని పరిస్థితి..ఆ పార్టీ నేతలది..!