ప్రత్యేకహోదా సాధ్యం కాదని… ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభకు వెళ్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ముందుగానే చేతులెత్తేశారు. రాజ్యసభకు ఎన్నికైనందున.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ.. ఆ లేఖను.. మండలి కార్యదర్శికి ఇచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వెంటనే.. అది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రత్యేకహోదా కోసం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని ప్రశంసించారు. సుభాష్ చంద్రబోస్… ఎమ్మెల్సీతో పాటు… మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో… పిల్లి సుభాష్‌తో పాటు రాజ్యసభకు ఎంపికైన మోపిదేవి వెంకటరమణ మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు.
సాధారణంగా…ఇద్దరూ.. ఒకే సారి ఎమ్మెల్సీకి.. మంత్రి పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే పిల్లి సుభాష్ మాత్రం.. ఈ విషయంలో తన సొంత నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మోపిదేవి ఆలోచన ఏమిటో బయటపడలేదు.. కానీ.. ప్రత్యేకహోదా సాధ్యం కాదంటూ.. ఢిల్లీకి వెళ్లక ముందే… పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పడంతో.. హోదా విషయంలో వైసీపీ చిత్తశుద్ధి మరోసారి చర్చనీయాంశమయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ తమపైనే ఆధారపడుతుందని… అప్పుడు..తాము అనుకున్నట్లుగా.. హోదా సాధించి తీసుకు వస్తామని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు.
అయితే.. ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్తున్న వారికి మాత్రం…ఆ విషయంలో కనీస నమ్మకం కూడా ఉండటం లేదు. ఈ విషయం పిల్లి సుభాష్ వ్యాఖ్యలతో నిరూపితమయింది. ఇప్పటికి 22 మంది లోక్ సభ సభ్యులు .. ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నా.. కేంద్రం దృష్టికి ప్రత్యేకహోదా అంశాన్ని తీసుకెళ్లడంలో వైసీపీ పెద్దగా చొరవ తీసుకుంటున్న పరిస్థితులేమీ కనిపించడం లేదు.