తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. ఆయనను శత్రువుగానే చూస్తానని డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు ఉన్నారు. ఆ కేసు భయంతోనే ఆయన వైసీపీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. పిల్లి సుభాష్ చంద్రబోస్ … రామచంద్రపురం పర్యటనకు వచ్చిన సమయంలో… దళితులు అడ్డుకున్నారు. పార్టీలో చేర్చుకుని… తోట త్రిమూర్తులును కేసు నుంచి కాపాడి దళితులకు అన్యాయం చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ నేరుగానే… తోట త్రిమూర్తులుపై విరుచుకుపడ్డారు. తోట త్రిమూర్తులు ఎప్పటికైనా తనకు శత్రువేనని ప్రకటించారు. పార్టీలోకి ఎందరో వస్తుంటారు…పోతుంటారని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటుందన్నారు.
వైసీపీకి దళితులు అండగా ఉన్నారు.. వారిని వదులుకోబోమని హామీ ఇచ్చారు. తోట త్రిమూర్తులపై ఉన్న కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను సీఎం దగ్గరికి తీసుకెళ్తానని.. అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా సిద్దమేనని ప్రకటించారు. నిజానికి తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం నియోజకవర్గంలో… ఆగర్భ శత్రువులు. వారి మధ్య వైరం రాజకీయంగా మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఉంటుంది.చాలా సమావేశాల్లో వీరు తిట్టుకునే తిట్లు.. చాలా పై స్థాయిలో ఉంటాయి. రాయలేని భాషలో తిట్టుకుంటూ ఉంటారు.
2014 ఎన్నికల్లో ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను… రామచంద్రాపురం నుంచి తప్పించిన జగన్… వేణుగోపాల్ అనే నేతకు టిక్కెట్ ఇచ్చారు. పిల్లి సుభాష్‌కు… ఆశల్లేని మండపేట సీటు ఇచ్చారు. అక్కడ ఆయన పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ… మొదటి నుంచి తనతోనే ఉన్నందున.. జగన్ పిల్లి సుభాష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు త్రిమూర్తులను పార్టీలోకి తీసుకోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.