ఆంధ్రప్రదేశ్లోని రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్ఆర్సిపి నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కేంద్రంగా నడుస్తున్న ఈ రాజకీయంలో, తాజాగా ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..
రామచంద్రపురం వైఎస్ఆర్సిపి లో అంతర్గత కుమ్ములాట:
పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం నియోజకవర్గంలో బలమైన నాయకుడు. 2004 సంవత్సరం లో కాంగ్రెస్ టికెట్ దొరక్కపోతే, ఇండిపెండెంట్గా పోటీ చేసి టిడిపి నేత తోట త్రిమూర్తులపై గెలిచారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పంచన చేరిన ఆయన 2009లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి , ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన తోట త్రిమూర్తులు పై అతి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే 2014లో టిడిపి తరఫున పోటీ చేసిన తోట త్రిమూర్తులు చేతిలో ఓడిపోయి ఆ తర్వాత వైఎస్ఆర్సిపి తరఫున రాజ్యసభకు వెళ్లారు. దీంతో 2019 లో వేణుగోపాలకృష్ణ కి రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వైఎస్ఆర్సిపి ఆయనను గెలిపించుకుంది. ప్రస్తుతం రామచంద్రపురం లో వైఎస్ఆర్సిపి లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు వేణుగోపాల్ రూపంలో ఇద్దరు బలమైన నాయకులు ఉండడమే కాక మరొక బలమైన నేత తోట త్రిమూర్తులు కూడా ఇదే పార్టీలో ఉండడం అంతర్గత కుమ్ములాటలకు కారణం అవుతుంది
తిరుగు బావుట ఎగరేసిన పిల్లి
అయితే రాజ్యసభ కారణంగా స్థానిక రాజకీయాలకు కాస్త దూరమైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మళ్లీ రామచంద్రాపురంలో తన పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే నియోజక వర్గం నుండి గెలిచి మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణకు మళ్ళీ వైఎస్ఆర్సిపి టికెట్ ఇస్తారనే ప్రచారం పార్టీలో ఉండడంతో, 2004లో లాగా అవసరమైతే తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అనుచరులతో ఆయన అన్నట్లు సమాచారం. ఈ వివాదం ముదిరి పాకాన పడడంతో పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. మిథున్ రెడ్డితో సుభాష్ చంద్రబోస్ ని సముదాయించే ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ ప్రయత్నాలు విఫలం అవడంతో ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు జనసేన ద్వారా పోటీ చేస్తాడని పుకార్లు కూడా వినిపించాయి.
జనసేనలో చేరతారనే ప్రచారాన్ని ఖండించిన పిల్లి సుభాష్ చంద్రబోస్
అయితే ఈ ప్రచారాన్ని స్వయంగా సుభాష్ చంద్రబోస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కి తాను పిల్లర్ లాంటివాడినని, పార్టీ ఆవిర్భావం ముందు నుండి పార్టీతో తాను ఉన్నానని గుర్తు చేసిన ఆయన, జనసేనకి కానీ వేరే ఇతర పార్టీలోకి కానీ తాను వెళతానని జరుగుతున్న ప్రచారం మొత్తం పుకార్లేనని, తాను వైఎస్ఆర్సిపి లోనే ఉంటానని స్పష్టం చేశారు.
పిల్లి కాదు తోట కావాలంటున్న జనసైనికులు:
అయితే సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే రామచంద్రపురం లోని ముగ్గురు బలమైన నేతలలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మంత్రి వేణుగోపాల్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ( శెట్టి బలిజ). తోట త్రిమూర్తులు మాత్రం మరొక సామాజిక వర్గానికి చెందినవారు ( కాపు). ఒకవేళ పిల్లి సుభాష్ చంద్రబోస్ వేణుగోపాల్ ఇద్దరు బరిలో ఉండే పక్షంలో ఓట్లు వారిద్దరి మధ్య చీలిపోతాయి కాబట్టి తోట త్రిమూర్తులు లాంటి బలమైన నేత, గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన నేత జనసేనకి వస్తే బాగుంటుందని, గెలుపు ఖాయం అవుతుందని జనసైనికులు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
మరి పిల్లి, వేణుగోపాల్ మరియు తోట త్రిమూర్తులు మధ్య మూడు ముక్కలాట గా మారిన రామచంద్రపురం రాజకీయం రాబోయే ఎన్నికల సమయానికి ఏమలుపు తిరుగుతుంది అన్నది వేచి చూడాలి.