మొదట గెలిచే సీటు మార్చి ఓడిపోయే సీటిచ్చారు. తర్వాత మంత్రిని చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు.. మళ్లీ పదవి పీకేశారు. ఎమ్మెల్సీ పదవి రద్దు చేశారు. రాజ్యసభ పదవి ఇచ్చి.. పూర్తిగా రాజకీయాల్లో కనబడకుండా చేశారు.. అసలు రాజకీయంగా విలువ లేకుండా చేశారు. ఇప్పుడు తాను ఎంత బకరా అయ్యానన్నది.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్కు బాగా అర్థమవుతోంది. దీంతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీ అంటున్నారు. ఈ వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది.
రామచంద్రాపురం నుంచే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిల్లి సుభాష్.గత ఎన్నికలకు ముందు ఆయనను కాదని చెల్లుబోయిన వేణుకు జగన్ సీటిచ్చారు. సుభాష్ చంద్రబోస్ ను మండపేట అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు గెలిచారు. కానీ మండపేటలో బోస్ ఓడిపోయారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి తన వెంటే ఉన్న బోస్ కు మంత్రి పదవి ఇస్తానని ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ పదవిలో కుదురుకోక ముందే.. మండలి రద్దు చేస్తానంటూ.. ఆయనతో రాజీనామా చేయించారు. మండపేటకు తోట త్రిమూర్తుల్ని ఇంచార్జ్ గా పెట్టారు.
అంటే రాజకీయాల నుంచి బోస్ ను పూర్తిగా పక్కన పెట్టారు. కానీరాజ్యసభ సీటిచ్చారు. ఇప్పుడు ఆయనకు జిల్లా రాజకీయాల్లో చోటులేకుండా పోయింది. ఇప్పుడు రామచంద్రాపురం సీటు తనదేనని.. తన కుమారుడు సూర్యప్రకాష్ కు టికెట్ ఇవ్వాలని కొరతున్నారు. కానీ వేణు ఇప్పటికే .. ఆరాధన చేసి తన టిక్కెట్ తనకే అని ఖరారు చేసుకున్నారు. దీంతో తమకు ఘోరమైన అవమానం జరుగుతోందని.. తాము సహించే ప్రశ్నే లేదంటున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బోస్ తన అనుచరులకు చెబుతున్నారు. దీంతో ఓ నేతను ఎలా నిర్వీర్యం చేయాలో జగన్ కు బాగా తెలుసని.. బోస్ బలైపోయాడని.. ఆయన అనుచరులు వేదన వ్యక్తంచేస్తున్నారు.