ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. మొతేరాలో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. తొలి రోజే 13 వికెట్లు కూలడం… అందుకు నిదర్శనం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (57 బ్యాటింగ్), రెహానే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
పిచ్ తీరుచూస్తుంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ.. బ్యాటింగ్ చేయడం కష్టంగా కనిపిస్తోంది. భారత్ కనీసం 100 పరుగుల ఆధిక్యం సంపాదించినా ఈ మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు. నాలుగో ఇన్నింగ్స్ లో ఎంత తక్కువ టార్గెట్ నిర్దేశిస్తే.. భారత విజయం అంత సులభం అవుతుంది. నాలుగో ఇన్నింగ్స్ లో 200 పరుగుల టార్గెట్ అయినా ఛేదించడం కష్టం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. తొలి రోజే స్పిన్నర్లకు అనుకూలించిన ఈ పిచ్, పేస్ బౌలర్లకూ చక్కగా సహకరిస్తోంది. రెండో రోజు ఉదయం… పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఆ తరవాత.. బౌలర్లకు సహరించే అవకాశం ఉంది. రోహిత్ క్రీజ్ లో ఉండడం, పంత్ ఫామ్ లో ఉండడం భారత్కు ఊరట కలిగించే విషయాలు.