భారత్ తో తొలిటెస్టులో ఘెరంగా భంగపడ్డ ఆస్ట్రేలియా, ఈ రోజు మొదలైన పింక్ బాల్ టెస్ట్ లో పుంజుకొంది. తొలిరోజే భారత్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత టాస్ గెలిచి, బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మరో 94 పరుగులు వెనుక బడిన ఆసీస్ చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి కాబట్టి, తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సంపాదించే అవకాశం ఉంది. ఆసీస్ కోల్పోయిన ఆ ఒక్క వికెట్ బుమ్రాకి దక్కింది.
భారత ఇన్నింగ్స్ లో నితిశ్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్ (37), గిల్ (31) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. స్టార్ బ్యాటర్లు రోహిత్ (3), విరాట్ కోహ్లీ (7) నిరాశ పరిచారు. రోహిత్ అయితే ఏ దశలోనూ కంఫర్ట్ గా అనిపించలేదు. విరాట్ స్లిప్ ఫీల్డర్లకు ప్రాక్టీస్ ఇచ్చి ఔటైనట్టు అనిపించింది. తొలి టెస్ట్ లో సెంచరీ చేసిన ఫామ్ లోకి వచ్చాడనుకొన్న విరాట్ కూడా పేలవమైన షాట్‌కు అవుట్ అవ్వడం అభిమానుల్ని నిరాశ పరిచింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాశించాడు. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తోంది. పేసర్లకు వికెట్లు పడుతున్నాయి. అయితే భారత బౌలర్లలో బుమ్రా తప్ప ఎవరూ పదునైన బంతుల్ని సంధించడం లేదు. సిరాజ్ కూడా ఈ పిచ్ పై తేలిపోయాడు. రెండో రోజు తొలి సెషన్లో భారత్ పుంజుకొని ఆసీస్ వికెట్లు పడగొట్టాలి. వీలైనంత తక్కువ స్కోరుకు పరిమితం చేయాలి. లేదంటే ఈ టెస్టు చేజాయిపోయినట్టే.