క్రికెటే ఓ మతంగా విలసిల్లే భారతదేశంలో… ఈ రోజు స్పెషల్ డే. ఆదరణ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్‌పై.. ఎన్నడూ లేనంత ఆసక్తి కలిగిస్తూ… ప్రపంచకప్ ఫైనల్ అంతటి ఉత్కంఠ రేపుతున్న పింక్ బాల్ టెస్ట్ నేటి నుంచి ఈడెన్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ డే నైట్‌లో జరగనుంది. ఇలా డే అండ్ నైట్ టెస్ట్ టీమిండియా ఆడటం ఇదే మొదటి సారి కావడం ఓ ప్రత్యేకత. సౌరభ్ గంగూలీ బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్పెషల్ టెస్ట్ రావడం… గంగూలీ సొంత గడ్డ.. ఈడెన్‌లో.. ఈ మ్యాచ్ జరగనుండటంతో.. హడావుడికి అంతే లేకుండా పోయింది.
పింక్ బాల్ టెస్ట్‌ను ఉత్సవంగా బీసీసీఐ నిర్వహిస్తోంది..పింక్ పోస్టర్లు, విభిన్న కటౌట్లతో కోల్‌కతాను ముస్తాబు చేశారు. నిజానికి ఇతర దేశాల్లో డే నైట్ టెస్టులు ఐదేళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. కానీ టీమిండియా మాత్రం.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మ్యాచ్ జరిగే ఐదురోజులు ప్రత్యేక అతిథులుగా ప్రముఖులు హాజరవుతున్నారు. తొలిరోజు బెంగాల్ సీఎం మమత, బంగ్లా ప్రధాని మ్యాచ్ చూస్తారు. మంచు పరిస్థితుల దృష్ట్యా రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఓ టెస్టును దక్కించుకున్న టీమిండియా… ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం వచ్చిన హైప్ కారణంగా.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. సాధారణం బలమైన జట్లతో టెస్ట్ మ్యాచ్ ఉన్నా.. రెండు, మూడు వేల మంది ప్రేక్షకులు హాజరు కాని పరిస్థితి ఉండేది.
ఇరు జట్ల ఆటగాళ్లకు… ఈడెన్ పింక్ టెస్ట్ ఓ సవాలాంటిది . ఫ్లడ్‌లైట్ల వెలుతురులో.. పింక్ బాల్‌ను ఎదుర్కోవడం.. బ్యాట్స్మెన్లకు అంత తేలిక కాదు. అయితే కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అబేధ్యంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ జట్టుకు అంత తేలిక కాదు. గెలుపు ఓటముల కన్నా.. పింక్ టెస్ట్‌గా.. క్రికెట్ చరిత్రలో… నిలిచిపోతుంది.