శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. అధ్యాత్మిక పరంగా చేసే ఏర్పాట్లకు ఈ సారి రాజకీయ రంగులు కనిపిస్తున్నాయి. ఈ రంగుల్లో .. తెలంగాణ రాష్ట్ర సమితి గుర్తు… గులాబీ కలర్ అన్నింటా డామినేట్ చేస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న టోల్‌గేట్‌కు కొత్త రంగులు వేస్తున్నారు. గోపురానికి, శ్రీవారి శుంఖు చక్రాలకు గులాబీ రంగు పూస్తున్నారు. గతంలో వీటికి తెలుపు, లేత పసుపు రంగులు వాడేవారు. ఇప్పుడు సంప్రదాయ విరుద్ధంగా గులాబీ రంగులను పూస్తున్నారు. దీంతో భక్తుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న టీటీడీ ఇప్పుడు..ఈ రంగుల విషయంలో సమర్థించుకోవడానికి తంటాలు పడాల్సి ఉంటుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఇప్పటికే రాష్ట్రేతరుల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. అందులోనూ.. తెలంగాణకు చెందిన ఏపీ సభ్యులతో పాటు పోటీగా ఉన్నారు. ఇక ఆలయంలో.. వారు చెప్పిందే వేదమన్నట్లుగా జరుగుతుందనే భావన ఏర్పడింది. పైగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జవదాటే పరిస్థితి లేదని .. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్‌ను మెప్పించేందుకు తిరుమలలో దేవుళ్ల చిహ్నాలకూ.. గులాబీ రంగులేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కేసీఆర్‌తో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి.. బ్రహ్మత్సవాలకు.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ క్రమంలో ఈ గులాబీ గుబాళింపులు అనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఏపీ సర్కార్‌కు ఈ రంగుల పిచ్చేమిటో… అన్న చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. ఇప్పటికే.. అన్న క్యాంటీన్లను మూత వేయడానికి నిర్ణయం తీసుకునే ముందే… మొత్తానికి కొన్ని కోట్లు కేటాయించి.. తెల్ల రంగు పూయించారు. ఆ తర్వాత ఇప్పటికే గ్రామ సచివాలయాల నుంచి స్మశానాల వరకూ.. దేన్నీ వదల కుండా వైసీపీ రంగులేస్తున్నారు. ఇప్పుడు.. శ్రీవారి ఆలయాన్ని మాత్రం టీఆర్ఎస్కు కేటాయించారా.. అని సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో అన్యమత వివాదాలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు రంగుల వ్యవహారమూ… హిందూత్వ వాదుల్ని.. ఆగ్రహం తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.